కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టు (కేఎన్పీపీ) మొదటి యూనిట్లో 75 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) మంగళవారం నాడు శ్రీకారం చుట్టింది.
కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టు (కేఎన్పీపీ) మొదటి యూనిట్లో 75 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) మంగళవారం నాడు శ్రీకారం చుట్టింది. పవర్ గ్రిడ్తో మొదటి యూనిట్ అనుసంధానం మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ప్రారంభమైందని, అప్పటినుంచి 75 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని కేఎన్పీపీ సైట్ డైరెక్టర్ ఆర్ఎస్ సుందర్ తెలిపారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో గల కూడంకుళంలో వెయ్యేసి మెగావాట్ల రెండు రష్యన్ రియాక్టర్లను ఎన్పీసీఐఎల్ ఏర్పాటు చేస్తోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 17వేల కోట్లు.
భారతదేశంలో మొట్టమొదటి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ కేఎన్పీపీయే. ఇది లైట్ వాటర్ రియాక్టర్ విభాగంలోకి వస్తుంది. మొదటి యూనిట్ క్రిటికల్ దశను ఇప్పటికే దాటింది. కేఎన్పీపీ తన రియాక్టర్ పవర్ స్థాయిని 50 శాతానికి పెంచి, గ్రిడ్తో అనుసంధానం చేసేందుకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్బీ) గత ఆగస్టులో అనుమతి తెలిపింది. ఆగస్టు నెలాఖరు నాటికే 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో అనుసంధానం పూర్తవుతుందని భావించినా, కండెన్సర్ వాల్వులలో సమస్యలు ఎదురవడంతో కొంత ఆలస్యమైంది. క్రమంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతామని అధికారులు అంటున్నారు.