
సాక్షి, అమరావతి బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు.
ఈమేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరీష్ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. రాజధాని ఎంపికకు ముందే అదే ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ భూములు కొనడం వెనుక భారీ అవినీతి ఉందని శర్మ చెప్పారు. అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.