స్విస్ ఛాలెంజ్ విధానం పేరిట రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధపడడం వెనుక భారీ కుంభకోణం ఉందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ విమర్శించారు. అందుకే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు కూడా వెల్లడించకుండా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందని ఆరోపించారు. ‘రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి చట్టం ( ఏపీఈడీఈఏ)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సింగపూర్ సంస్థలు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వర్తింపజేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్‌కు ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు.
ప్రభుత్వం గాని, ప్రభుత్వ ఏజెన్సీకి గానీ కనీసం 52 శాతం వాటా ఉన్న సంస్థలకే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వర్తింపజేయాలని ఏపీఈడీఈఏ చట్టం స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. కానీ, అమరావతి నిర్మాణంలో సీఆర్‌డీఏకు 48 శాతం మాత్రమే వాటా ఇచ్చినందున స్విస్ ఛాలెంజ్ విధానం వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధమని శర్మ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఎవరైనా న్యాయస్థానంలో సవాల్ చేస్తే మొత్తం ప్రక్రియ నిలిచిపోయే అవకాశాలున్నాయన్నారు. అప్పుడు సింగపూర్ సంస్థలు తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే ఎంతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. అసలు స్విస్ ఛాలెంజ్ విధానం అన్నది భారీ అవినీతికి ఆస్కారమిస్తున్న లోపభూయిష్టమైన ప్రక్రియ అని కేల్కర్ కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌గా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకత్వానికి వివరించాల్సి బాధ్యత ప్రధాన కార్యదర్శి టక్కర్‌పై ఉందని కూడా ఆయన తేల్చిచెప్పారు. లేకపోతే ఈ భారీ కుంభకోణానికి, అక్రమాలకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకత్వంతోపాటు ఉన్నతాధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని శర్మ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నిగ్గు తేల్చాలని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్)కు ఫిర్యాదు చేస్తున్నానని కూడా ఆయన వెల్లడించారు. అవినీతి నిరోధక శాఖ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తానన్నారు.