
పూలింగ్‌లో కుంభకోణం
⇒ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ
⇒ సీఆర్‌డీఏ అధికారులు చట్టాలు,రాజ్యాంగం చదవాలి
సాక్షి, అమరావతి : సీఆర్‌డీఏ అధికారులకు ఇంగిత జ్ఞానం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. వారు చట్టాలు.. రాజ్యాంగాన్ని చదవాలని హితవు పలికారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన సూచనలు, ఆదేశాలపై వారు చెబుతున్న మాటలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట విరుద్ధంగా పనిచేస్తే ఇప్పుడు కాకపోయినా నాలుగేళ్ల తర్వాతైనా అధికారులు ఇబ్బంది పడక తప్పదన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆయన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూ సమీకరణలో కుంభకోణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
విశాఖపట్నం పరవాడ భూ సమీకరణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, ఇక్కడా అలాంటి పరిస్థితి నెలకొందన్నారు. అమరావతిలో డి ఫారం పట్టా భూములు కొనుగోలు చేసిన వారికి పరిహారం ఇవ్వవచ్చని ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చిందని, అది చెల్లదని దానిపై ప్రభు త్వ సీఎస్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. అవసరం లేకున్నా వేలాది ఎకరా లు సేకరి స్తూ ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తోందని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని మారిస్తే హైకోర్టులో సవాలు చేస్తామన్నారు.
మంచినీళ్లు తాగినట్లు..: మంచినీళ్లు తాగినంత తేలిగ్గా రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం – అమరావతి రహదారికి 26,800 ఎకరాలు, అమరావతి అవుటర్ రింగు రోడ్డుకు 8,500 ఎకరాలను నెలల వ్యవధిలో సేకరించాలని ముఖ్య మంత్రి ఆదేశించడం దారుణమన్నారు.