సాక్షి, అమరావతి : పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం ద్వారా స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందని శ్రావణ్‌కుమార్ అనే న్యాయవాది తమ దృష్టికి తెచ్చిన అంశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ధర్మకర్తలా పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర వహించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.
సహజ వనరులపై ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుచేసింది. ప్రజలకు సమాన హక్కులు ఉన్న సహజ వనరులను కొందరు పెద్దల ముఠాకే దోచిపెట్టడం సమానత్వం సిద్ధాంతాన్ని అవహేళన చేయడమేనని స్పష్టంచేసింది. ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తవ్వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని అప్పట్లో ఎన్జీటీ ఘాటుగా స్పందించింది.
అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతిన్నదని.. దానివల్ల ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రజల హక్కులను ఇసుక స్మగ్లర్లు కాలరాస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమిటని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని 2019, ఏప్రిల్ 4న అల్టిమేటం జారీచేసింది.
మహిళా సంఘాల ముసుగులో దోపిడీ..
నిజానికి.. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అప్పగిస్తూ తొలుత ప్రకటించింది. మహిళా సంఘాల ముసుగులో ముఖ్యనేత దన్నుతో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్‌లను హస్తగతం చేసుకుని.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకున్నారు.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2016, మార్చి 4న ఆ విధానాన్ని రద్దుచేసి.. ఉచిత ఇసుక ముసుగులో తమ ముఠా దోపిడీకి అప్పటి సీఎం చంద్రబాబు రాచబాట వేశారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ప్రకాశం బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లు, మర పడవలు ఏర్పాటుచేశారు.
తద్వారా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయించిన ముఠా పెద్దఎత్తున అక్రమార్జన సాగించింది. దీనిపై 2016లోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2017, ఫిబ్రవరి 23న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు..
అయినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2019 జనవరి 17–18న చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది.
ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టంచేసింది.
‘‘సహజ వనరులు ప్రజల ఆస్తులు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాలి. నియంత్రణ లేకుండా ఇసుకను తవ్వి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేయడంవల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించిన వారి నుంచి పరిహారాన్ని వసూలుచేసి.. దానితో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వం బాధ్యత’’. – 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేసిన వ్యాఖ్య.
Comments
Please login to add a commentAdd a comment