
సాక్షి, విశాఖపట్నం: పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో భన్వర్‌లాల్ తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాలను నియంత్రించారని, అందువల్లే ఆయనపై సర్కారు కక్ష కట్టి వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు.
పదవీ విరమణ చేసిన రోజే ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు శర్మ.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకే జ్యోతికి గురువారం లేఖ రాశారు. భన్వర్‌లాల్ వ్యవహారంలో సీఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో రాష్ట్రాల ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేరని, తద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని ఆందోళన వ్యక్తం చేశారు.
నంద్యాల ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికి మించి వ్యయం చేశారని, దీనిపై కూడా ఎన్నికల కమిషన్ చట్టపరంగా వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఇలా ఎన్నికల అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడం, వారిపై వేధింపులకు దిగడం ఇదే తొలిసారి కాదన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని శర్మ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment