సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్ షాక్‌కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు.
అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment