ఐసీసీ ఎలైట్ అంపైర్ల జాబితా ప్రకటన
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ అంపైర్ల ప్యానెల్‌లో వరుసగా ఐదో ఏడాది తన స్థానం పదిలం చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన నితిన్ తొలిసారి 2020లో ఐసీసీ ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత నాలుగేళ్లుగా ఐసీసీ ఆయన సేవల్ని గుర్తించి ఎలైట్ ప్యానెల్‌లో కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా మరోసారి పొడిగింపు లభించింది.
ఓవరాల్‌గా అత్యున్నత అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికైన మూడో భారత అంపైర్ మీనన్. గతంలో ఎస్. రవి, మాజీ స్పిన్నర్ ఎస్. వెంకటరాఘవన్‌లు ఎలైట్ క్లబ్‌లో ఉండేవారు. రవి 33 టెస్టు మ్యాచ్‌లకు ఫీల్డ్ అంపైర్‌గా సేవలందించగా, వెంకటరాఘవన్ ఏకంగా 73 టెస్టులకు (అన్ని ఫార్మాట్లలో 125 మ్యాచ్‌లు) అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం 12 మంది సభ్యులు గల ఈ ఎలైట్ క్లబ్‌లో భారత్ నుంచి 40 ఏళ్ల నితిన్ మీనన్ ఒక్కరే ఉన్నారు.
కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఆయన 122 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలా షాహిద్‌కు కొత్తగా ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కింది. బంగ్లా తరఫున ఈ అర్హత సాధించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల జాబితా నుంచి సీనియర్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను తొలగించారు.
2003 నుంచి సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన 123 టెస్టులు, 361 వన్డేలు, 135 టి20లు, 15 మహిళల టి20లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పునరి్నర్మాణ ప్రక్రియలో భాగంగానే ఆయన్ని తప్పించామని, ఇతరత్రా కారణాల్లేవని ఐసీసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment