పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆరు పాయింట్లను కోల్పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున పాక్ జట్టుకు ఆరు పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.
బంగ్లా చేతిలో పాకిస్తాన్ చిత్తు
కాగా డబ్ల్యూటీసీలో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య రీతిలో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా ఆహ్వానించింది. తద్వారా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఓడిన తొలి పాక్ జట్టుగా షాన్ మసూద్ బృందం చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది.
బంగ్లాకు సైతం ఎదురుదెబ్బ
ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ఇలా బాంబు పేల్చడం గమనార్హం. బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ.. పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతతో పాటు ఆరు పాయింట్లు కట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు కూడా స్లో ఓవర్ రేటు సెగ తగిలింది.
ఫలితంగా నజ్ముల్ షాంటో బృందం మూడు డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు 15 శాతం మేర మ్యాచ్ ఫీజు కోల్పోయింది. అంతేగాక.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు పనిష్మెంట్ ఇచ్చింది ఐసీసీ. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌పైకి బంతిని విసిరినందుకు గానూ.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేసింది. అదే విధంగా.. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1 ప్రకారం.. ఒక డిమెరిట్ పాయింట్( దురుసుగా ప్రవర్తించినందుకుగానూ) ఇచ్చింది.
టాప్‌లోనే టీమిండియా.. బంగ్లా, పాక్ ఏ స్థానంలో?
ఈ పరిణామాల అనంతరం డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మరోవైపు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.
PC: insidesport
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)
టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్
పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్
బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565
పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్
బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0
ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).
చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్
Comments
Please login to add a commentAdd a comment