బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి తొలిసారి.. ఆ జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ పర్యటన సాగుతుందా లేదోనన్న సందేహాల నడుమ.. అక్కడికి వెళ్లడమే కాదు ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆరు వికెట్ల తేడాతో ఓడించి
కాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 సీజన్‌లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. మంగళవారం ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.
మాటలు రావడం లేదు
ఈ క్రమంలో చారిత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మాట్లాడుతూ.. ‘‘ఈ గెలుపు మాకెంతో కీలకమైనది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్‌లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారు.
మా జట్టు అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అత్యుత్తమంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగాం. గెలవాలన్న కసి, పట్టుదల మమ్మల్ని ఈస్థాయిలో నిలిపాయి. తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్ కూడా ఎంతో ముఖ్యమైనది.
టీమిండియాతో సిరీస్‌కు సిద్ధం
ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెడతాం. టీమిండియాతో సిరీస్‌లో ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఐదు వికెట్లు పడగొట్టిన తీరు అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేయడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని నజ్ముల్ షాంటో తెలిపాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి రోహిత్ సేనతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు స్కోర్లు
వేదిక: రావల్పిండి
టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్
పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 274 ఆలౌట్
బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 262 ఆలౌట్
పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 172 ఆలౌట్
బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 185/4
ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై బంగ్లా గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లిటన్ దాస్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: మెహదీ హసన్ మిరాజ్
చదవండి: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్
Comments
Please login to add a commentAdd a comment