పాకిస్తాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అద్భుత శతకం(191)తో అలరించాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి పట్టుదలగా క్రీజులో నిలబడి సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో అతడికి ఇది పదకొండో సెంచరీ. అయితే, దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.
అయినప్పటికీ జట్టును మాత్రం పటిష్ట స్థితిలో నిలపగలిగాడు ముష్ఫికర్ రహీం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పర్యాటక బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
పాక్ బ్యాటర్ల శతకాలు
బంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసిన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సయీమ్ అయూబ్(56) రాణించగా.. సౌద్ షకీల్(141), మహ్మద్ రిజ్వాన్(171 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(93) శుభారంభం అందించాడు.
అయితే, మరో ఓపెనర్ జాకిర్ హసన్(12), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో(16) పూర్తిగా నిరాశపరిచారు. వీరి తర్వాతి స్థానాల్లో వచ్చిన మొమినుల్ హక్(50) అర్ధ శతకం సాధించగా.. ముష్ఫికర్ రహీం విశ్వరూపం ప్రదర్శించాడు. మొత్తంగా 341 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 191 పరుగులు సాధించాడు.
బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేను వేల పరుగుల మైలురాయిని దాటేశాడు ముష్ఫికర్ రహీం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున 2005లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు 80 టెస్టుల్లో 11 శతకాలు, 3 ద్విశతకాల సాయంతో 5867, 271 వన్డేల్లో 9 సెంచరీల సాయంతో 7792 రన్స్, 102 టీ20లలో 1500 పరుగులు సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాక్- బంగ్లా తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ముష్ఫికర్‌తో పాటు లిటన్ దాస్(56), మెహదీ హసన్ మిరాజ్(71 బ్యాటింగ్) రాణించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. 167.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 565 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు తుదిజట్లు
పాకిస్తాన్
అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ.
బంగ్లాదేశ్
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లాం, జాకిర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహీద్ రాణా.
Mushfiqur Rahim completes his 11th Test century, much to the delight of his teammates and fans 🇧🇩🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/jWqAX7YVdR
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024
Comments
Please login to add a commentAdd a comment