బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ జట్టు నుంచి తక్షణమే తొలగించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఓ లాయర్ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న షకీబ్‌ను బంగ్లాదేశ్‌కు రప్పించి.. అతడిని విచారించాల్సిందిగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా షకీబ్‌పై హత్య కేసు నమోదైన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గద్దె దిగిన షేక్ హసీనా ప్రభుత్వంలో 37 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ ఎంపీగా ఉన్నారు. షేక్ హసీనా ప్రభుత్వం రద్దు కావడంతో అతని ఎంపీ పదవి కూడా ఊడింది. అయితే మూక దాడులు, పేట్రేగిన ఆందోళనకారుల వల్ల అమాయకులెందరో ప్రాణాలొదిలారు.
ఈ నేపథ్యంలో రఫీఖుల్ ఇస్లామ్ అనే వ్యక్తి మాజీ ప్రధాని, సహచర మంత్రులు, ఎంపీలపై కేసు పెట్టారు. ఈ నెల 7న జరిగిన హింసాత్మక ఘటనలో ఇస్లామ్ కుమారుడు రుబెల్ మృతి చెందాడు. దీంతో తన కుమారుడి మరణానికి గత ప్రభుత్వానిదే బాధ్యతని ఇస్లామ్ ఢాకాలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన పోలీసులు ప్రధాని సహా పదుల
సంఖ్యలో పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
ఇందులో షకీబ్‌ను 28వ నిందితుడిగా చేర్చుతూ హత్య కేసు నమోదు చేశారు. నిజానికి ఈ ఆల్‌రౌండర్ ఆగస్టు 5కు ముందు, తర్వాత దేశంలో లేడు. గ్లోబల్ టీ20 లీగ్ ఆడేందుకు కెనడా వెళ్లాడు. జూలై 26 నుంచి ఆగస్టు 9 వరకు జరిగిన ఆ లీగ్‌లో ఆడి... అక్కడి నుంచి నేరుగా పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ జట్టుతో జతకలిశాడు. ఆగష్టు 21న మొదలైన తొలి టెస్టులో ఆడుతున్న షకీబ్.. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
అయితే, తాజా సమాచారం ప్రకారం హత్య కేసులో నిందితుడిగా ఉన్న షకీబ్‌ను జాతీయ జట్టులో ఆడించవద్దని బంగ్లా సుప్రీం కోర్టు లాయర్ షాజీబ్ మహమూద్ ఆలం.. తన సహచర లాయర్ ఎండీ రఫినూర్ రహ్మాన్ తరఫున బీసీబీకి నోటీసులు పంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ విషయం గురించి షాజీబ్ బంగ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ నిబంధనల ప్రకారం షకీబ్‌కు జట్టులో ఉండే హక్కు లేదని నోటీసులో స్పష్టం చేసినట్లు తెలిపాడు. అయితే, అతడిని వెంటనే వెనక్కి తీసుకురావాల్సిందిగా తాము కోరలేదని.. బీసీబీ కొత్త టీమ్ ఇప్పుడే ఏర్పడిందని.. వారికి తగినంత సమయం ఇస్తామని పేర్కొన్నాడు.
చదవండి: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి రాజీనామా.. కొత్త చీఫ్‌గా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment