రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు చేరుకుంది. బంగ్లాలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్‌పై సందిగ్దం నెలకొనగా.. తాత్కాలిక ప్రభుత్వం ఎట్టకేలకు ఇందుకు అనుమతినివ్వడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే, ఈ జట్టులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆ దేశ మాజీ ఎంపీ, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు కూడా చోటునివ్వడం విశేషం.
అందుకే అతడికి అనుమతి
ఈ విషయం గురించి బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా దేశ తాత్కాలిక క్రీడా శాఖ మంత్రితో మాట్లాడాము. షకీబ్‌ను జట్టులో చేర్చడానికి ఆయన ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక ఉండాలని.. పక్షపాతం చూపకూడదని స్పష్టం చేశారు. అందుకే షకీబ్ కూడా పాక్‌తో సిరీస్ ఆడనున్న జట్టులో స్థానం సంపాదించగలిగాడు’’ అని తెలిపాడు.
కాగా షేక్ హసీనా పాలనను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. నిరసనకారుల భారీ ఆందోళనలకు తలొగ్గిన షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్(పార్టీ)తో సంబంధం ఉన్న ప్రముఖుల ఇళ్లపైనా దాడులు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తజా ఇంటికి నిప్పు అంటించారు.
అతడి అవసరం జట్టుకు ఉంది
అతడు అధికార అవామీ లీగ్ ఎంపీ( నరేల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంట్ నియోజకవర్గం) కావడమే ఇందుకు కారణం. ఈ ప్రభావం.. మరో ఎంపీ షకీబ్ అల్ హసన్‌పై కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ఆల్‌రౌండర్ కెరీర్ ఇక ముగిసిపోతుందని విశ్లేషకులు భావించారు. అయితే, తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న 26 ఏళ్ల ఆసిఫ్ మహమూద్ షకీబ్ ఎంపిక విషయంలో చొరవ చూపినట్లు తెలుస్తోంది.
చట్ట సభ ప్రతినిధిగా అతడు ఏ పార్టీకి చెందినవాడైనా.. ఆటగాడిగా జట్టుకు అతడి అవసరం ఉంది గనుక పాక్ సిరీస్‌కు ఎంపిక చేసేందుకు అనుమతినిచ్చినట్లు బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ తాజాగా వెల్లడించాడు. కాగా షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దు నేపథ్యంలో మగురా ఎంపీగా ఉన్న షకీబ్ పదవి కోల్పోయాడు.
ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అతడు లక్షా యాభై వేలకు పైగా మెజారిటీతో గెలుపొందాడు. ప్రతిపక్షం ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన నేపథ్యంలో అతడికి ఏకపక్ష విజయం సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21-25(రావల్పిండి), ఆగష్టు 30-సెప్టెంబరు 3(కరాచీ) మధ్య పాక్- బంగ్లా టెస్టు సిరీస్ జరుగనుంది.
బంగ్లాదేశ్ జట్టు..
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్
పాకిస్తాన్ జట్టు..
షాన్ మసూద్ (కెప్టెన్), సైమ్ అయూబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఖుర్రమ్ షెహజాద్, షాహీన్ అఫ్రిది.
Comments
Please login to add a commentAdd a comment