కనిపించని క్రీడాస్ఫూర్తి!
ఢాకా: భారత్‌పై గెలవాలన్న కసిని ప్రదర్శించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఏ అవకాశం వచ్చినా వదులుకోలేదు. ఈ క్రమంలో వారు పూర్తిగా క్రీడాస్ఫూర్తిని మరచిన ఘటన మ్యాచ్‌లో జరిగింది. మొర్తజా వేసిన పదో ఓవర్లో బంతి ధావన్ బ్యాట్‌కు తగిలి కీపర్ ముష్ఫికర్ వైపు వెళ్లింది. దానిపై బౌలర్ అప్పీల్ చేయడం, ఆ వెంటనే అంపైర్ టకర్ అవుట్ ఇవ్వడం వెంటనే జరిగిపోయాయి. ధావన్ కూడా క్రీజ్ వదిలి పెవిలియన్ వైపు సాగాడు. అయితే అసలు ఆ క్యాచ్‌ను కీపర్ పట్టనే లేదు. అతని చేతుల్లో బంతి పడ్డా పట్టు జారి కింద పడిపోయింది. దీనిని బౌలర్, అంపైర్ గమనించలేదు. కానీ ఫీల్డర్ బంతిని అందుకొని నేరుగా వికెట్లపైకి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. దీనికి బంగ్లా ఆటగాళ్లు రనౌట్ కోసం అప్పీల్ చేశారు! వాస్తవానికి అంపైర్ నిర్ణయం తర్వాత అవుట్ కోసం అప్పీల్ చేయడం సరైంది కాదు. కానీ వారు దానిని పట్టించుకునే స్థితిలో లేరు. చివరకు అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆటగాళ్లకు సర్ది చెప్పాల్సి వచ్చింది.