ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్, మాజీ కెప్టెన్, పార్లమెంట్ సభ్యుడు మష్రఫే మొర్తజా కరోనా బారిన పడ్డాడు. కొన్ని నెలలుగా తన నియోజకవర్గ ప్రజలకు కోవిడ్–19 పట్ల అవగాహన కల్పించడంలో చురుగ్గా పనిచేస్తోన్న 36 ఏళ్ల మొర్తజా శనివారం కరోనా పాజిటివ్‌గా తేలాడు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న అతనికి శుక్రవారం కరోనా పరీక్ష నిర్వహించారు. రిపోర్టుల్లో పాజిటివ్‌గా తేలినట్లు అతని తమ్ముడు మోర్సలిన్ బిన్ మొర్తజా ప్రకటించాడు. ప్రస్తుతం మొర్తజా తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు మోర్సలిన్ తెలిపాడు. ‘రెండు రోజులుగా మొర్తజా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష చేయగా వైరస్ సోకినట్లుగా తెలిసింది. అతని ఆరోగ్యం కోసం ప్రార్థించండి’ అని మోర్సలిన్ పేర్కొన్నాడు. 2018 ఎన్నికల్లో మొర్తజా నరాలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. బంగ్లాదేశ్ తరఫున అతను 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టి20లు ఆడాడు.
మొర్తజాతో పాటు మరో ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు నఫీస్ ఇక్బాల్, నజ్ముల్ ఇస్లామ్‌లకు కూడా కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వారే ధ్రువీకరించారు. వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు స్వయాన అన్న అయిన నఫీస్ 2003 నుంచి 2006 వరకు బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో 34 ఏళ్ల నఫీస్ 11 టెస్టుల్లో 518 పరుగులు, 16 వన్డేల్లో 309 పరుగులు సాధించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నజ్ముల్ బంగ్లాదేశ్ తరఫున ఒక టెస్టు, ఐదు వన్డేలు, 13 టి20 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment