మాకు దేశభక్తి ఏమిటి?: క్రికెటర్
న్యూఢిల్లీ: క్రికెటర్లు నిజమైన స్టార్లు కాదంటున్నాడు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా. డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడే తమను నిజమైన స్టార్లుగా ఎలా గుర్తిస్తారంటూ ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టాడు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు దేశభక్తిని అంటగట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. క్రికెటర్లకు, దేశభక్తికి ముడిపెట్టడం తగదని మొర్తాజా తెలిపాడు.
'మేము డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడతాం. మరి అటువంటప్పుడు మాకు దేశభక్తి ఏమిటి. నిజమైన స్టార్లు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్లు, రైతులు, కూలీలు మాత్రమే. నేను ఒక క్రికెటర్ని. ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది డాక్టర్లకు మాత్రమే ఉంది. కానీ డాక్టర్లు కోసం ఎవ్వరూ క్లాప్స్ కొట్టరు. వారికి గుర్తింపు తీసుకురండి. ఇంకొన్ని ప్రాణాల్ని నిలబెడతారు. కొన్ని అద్భుతాలను చేసే శక్తి డాక్టర్లకు ఉంది. వారు రియల్ స్టార్స్. మరి దేశ అభివృద్దికి తోడ్పడే శ్రామికులు కూడా స్టార్లే. దయచేసి క్రికెటర్లను హీరోలుగా గుర్తించొద్దు' అని మొర్తజా ఒక వేదాంత ధోరణిలో మాట్లాడాడు.