'ఆ రెండు క్యాచ్ లు కొంపముంచాయి'
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. అయితే తమ జట్టు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలే ఓటమికి కారణాలుగా మారుతున్నాయని ఆ జట్టు కెప్టెన్ ముష్రాఫే మొర్తజా పేర్కొన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. షేన్ వాట్సన్, జాన్ హెస్టింగ్స్ ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా విజయం తమ జట్టుదేనని బంగ్లా కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
తమ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసినా, ఫీల్డింగ్ లోపాల వల్ల ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యామని మొర్తజా అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్లు కాస్త త్వరగా రాణించి వికెట్లు తీసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చెప్పుకొచ్చాడు. చివర్లో బౌలర్లు రాణించడంతో ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగామని చెప్పాడు. బంగ్లా జట్టు బుధవారం తమ తదుపరి పోరులో పటిష్ట భారత్ తో తలపడనుందని తెలిపాడు. ఆసీస్ తో మ్యాచ్ లో ఓడినప్పటికీ తమ ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ మాత్రం పెరిగిందని మొర్తజా వివరించాడు.