'భారత్ ను ఆశ్చర్యపోయేలా చేస్తాం'
మిర్పూర్ (బంగ్లాదేశ్) : భారత్ తో వన్డే సిరీస్లో తమ జట్టును ఎంతో ముందుకు నడిపించాలని చూస్తున్నట్లు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రాఫే మోర్తాజా చెప్పాడు. రేపటి నుంచి ప్రారంభంకానున్న 3 వన్డేల సిరీస్కు ముందు రోజు మోర్తాజా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. జట్టులో చాలా మంది యువకులు ఉన్నారని, తమ ఆటతీరుతో రెండు సార్లు ప్రపంచ విజేత భారత్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తామని మోర్తాజా ధీమా వ్యక్తం చేశాడు.
భారత్తో మ్యాచ్ అనేది మాకు ఎప్పుడు సవాళ్లతో కూడుకున్నదని పేర్కొన్నాడు. అయితే, బంగ్లా ఆటగాళ్లు కెరీర్ లోనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నందున ఆటతీరుతో భారత్ను ఆశ్చర్యపోయేలా చేస్తామని వన్డే కెప్టెన్ చెప్పాడు. గాయాలనుంచి ప్రస్తుతం తాను కోలుకున్నానని, బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీసు కొనసాగించినట్లు తెలిపాడు. అయితే, భారత్తో ఏకైక టెస్టుకు కొన్ని రోజుల ముందు ప్రమాదానికి గురై రెండు చేతులకు స్వల్పగాయాలవడంతో ఆ మ్యాచ్కు మోర్తాజా దూరమైన విషయం తెలిసిందే.