'ఆ మ్యాచ్ తరువాత డిన్నర్ చేయలేదు'
శ్రీనగర్:వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక పరుగు తేడాతో ఓడిపోవడం తమ జట్టు మొత్తాన్ని తీవ్రంగా కలచివేసిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా స్పష్టం చేశాడు. ఆటలో గెలుపు-ఓటములు ఒక భాగమే అయినా, ఆ మ్యాచ్లో పరాజయం చెందుతామని ఊహించనే లేదన్నాడు. దీంతో ఆ రోజు జట్టులోని సభ్యులెవ్వరూ కనీసం డిన్నర్ కూడా చేయకుండా అలానే ఉండిపోయామన్నాడు.
హాలీ డే ట్రిప్లో భాగంగా కశ్మీర్లో ఉన్న మోర్తజా... ఆ మ్యాచ్ కు సంబంధించి స్థానిక యువకులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. 'భారత్తో ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. మూడు బంతులు ఉండగా రెండు పరుగులు చేయలేక చతికిలబడ్డాం. ఒక పరుగుతో ఓటమి మరింత బాధించింది. ఆ మ్యాచ్లో విజయం చేతివరకూ వచ్చి చేజారింది. గెలుస్తామనుకున్న మ్యాచ్లో అనూహ్యంగా ఓటమి చెందాం. ఆ రాత్రి ఎవరూ డిన్నర్ కూడా చేయలేదు' అని మోర్తాజా చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు.