బంగ్లాదేశ్ చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో తొలిసారి పాక్ బంగ్లాతో మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అది కూడా సొంతగడ్డపై ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి షాన్ మసూద్ బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. అయితే, ఈ ఘోర పరాభవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన నక్వీ నేతృత్వంలోని బోర్డు పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు
‘‘దేశ ప్రజలు టీవీలో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ ఇప్పుడు దానిని కూడా నాశనం చేస్తున్నారు. సమర్థత లేని, తమకు ప్రియమైన అధికారులను నియమించుకోవడం వల్లే పాక్ బోర్డుకు ఈ గతి పట్టింది. వాళ్ల హయాంలో తొలిసారి మన జట్టు వన్డే వరల్డ్‌కప్ టాప్-4కు చేరలేకపోయింది.
టీ20 ప్రపంచకప్-2024 టాప్-8లోనూ నిలవలేకపోయింది. ఇప్పుడు ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి పూర్తిగా దిగజారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఇదే జట్టు టీమిండియాను ఓడించింది కదా! మరి ఈ స్వల్ప కాలంలో అంతగా ఏం జరిగిందని.. ఇంతటి ఘోర పరాభవాలు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి? దీనంతటికీ ఒకే వ్యవస్థ కారణం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాక్ బోర్డుపై నిప్పులు చెరిగాడు.
పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు
అదే విధంగా.. నక్వీ దుబాయ్‌లో తన భార్య పేరు మీద ఐదు మిలియన్ డాలర్ల మేర ఆస్తులు కూడబెట్టాడని.. 2008లో అవినీతి ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నాడని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అనే పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఈ మాజీ క్రికెటర్‌పై ఇతరత్రా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు రావల్పిండి సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా ఈమేరకు సందేశం పంపించాడు.
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)
వేదిక: రావల్పిండి
టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్
పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్
బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565
పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్
బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0
ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).
చదవండి: రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు
Comments
Please login to add a commentAdd a comment