Affiliations
-
ముందే అనుబంధ గుర్తింపు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈసారి మేలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినా దాని అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ఆదేశాలు జారీ అయి రెండు నెలలైనా ఇప్పటికీ కార్యాచరణ ప్రారంభం కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. జాప్యాన్ని నివారించాలనుకుంటున్నా.. ఏటా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ విద్యాసంవత్సరం మొదలైన కొన్ని నెలల వరకూ జరుగుతుండటంతో గుర్తింపు రాకుండానే చాలా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. నిబంధనలు పాటించనందుకు ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వరాదని అధికారులు భావిస్తున్నప్పటికీ అప్పటికే చేరిన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గుర్తింపు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇది విద్యాశాఖకు తలనొప్పిగా మారుతోంది. దీన్ని నివారించేందుకే ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగిసేలోగా గుర్తింపు పక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. నిబంధనలు బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాలు.. రాష్ట్రంలోని 1,856 ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో దాదాపు 400 కాలేజీలు ఇరుకైన ప్రదేశాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయి. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు లేకున్నా ఆయా బోధన సాగిస్తున్నాయి. మరికొన్ని కాలేజీల్లో కనీస మౌలిక వసతుల్లేవు. దీనిపై ఇంటర్ బోర్డు కొన్నేళ్లుగా నోటీసులిస్తున్నా యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలంటే ఆయా యాజమాన్యాలు తాము నడిపే కాలేజీల ప్రాంతాలపై స్పష్టత ఇవ్వాలి. అప్పుడే గుర్తింపు ప్రక్రియ సాధ్యం కానుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానుండగా ఏప్రిల్, మే నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ నుంచి కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండటంతో ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా ముందే అనుబంధ గుర్తింపు ఎలా ఇవ్వగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుర్తింపు అనుకున్నట్టు పూర్తవ్వడం కష్టమేనని బోర్డు వర్గాలు అంటున్నాయి. డిగ్రీ సీట్లపై స్పష్టత ఏది? రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 4.6 లక్షల సీట్లున్నాయి. వాటిల్లో ఏటా భర్తీ అవుతున్నవి సుమారు 2.25 లక్షల సీట్లే. సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని కోర్సుల్లో జీరో ప్రవేశాలుంటున్నాయి. వాటిని రద్దుచేస్తామని ఉన్నత విద్యామండలి ఏటా చెప్పడమే తప్ప కార్యాచరణకు దిగడం లేదు. ఈ ఏడాది దాదాపు లక్ష సీట్లను ఫ్రీజ్ చేయగా వచ్చే ఏడాది ఇలాంటి సమస్య రాకుండా కాలేజీలే అవసరం లేని సీట్లను వదులుకోవాలనే అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాది కొత్తగా విభిన్న కోర్సుల సమ్మేళనంతో డిగ్రీ ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఆర్ట్స్ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుచేసే అవకాశం ఇస్తామంటున్నారు. ఇది జరగాలంటే ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవాలి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవాలి. వచ్చే మే నాటికి ఈ ప్రక్రియ పూర్తవ్వాలని ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు సూచించింది. కానీ ప్రైవేటు కాలేజీలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు కోర్సులను మార్చుకోవడం, అందుకు తగ్గ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకోవడం కష్టమని పేర్కొంటున్నాయి. వర్సిటీలను అప్రమత్తం చేశాం మార్పులను స్వాగతించేలా ప్రైవేటు కాలేజీలకు నచ్చజెప్పి వారి భాగస్వామ్యాన్ని పెంచుతాం. ఈ దిశగా అన్ని వర్సిటీలను అప్రమత్తం చే స్తాం. విద్యార్థులకు అవసరమయ్యే కోర్సులనే తీసుకోవడం కాలేజీలకు మంచిది. డిమాండ్ లేకుండా అనుమతులివ్వడం వల్ల ఉపయోగం లేదు. వీలైనంత త్వరగా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఈ ఏడాదికి ‘గుర్తింపు’ ఇచ్చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అనుమతులు లేక పెడింగ్‌లో ఉన్న 465 ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. పరీక్షలు దగ్గరపడుతున్న కారణంగానే ఈసారికి గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి కఠినంగానే వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. కాలేజీలు ప్రారంభమయ్యేనాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అర్హతలు పరిశీలిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో ఈ సంవత్సరం దాదాపు లక్ష మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాయాల్సిన ముప్పు తొలగిపోనుంది. ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉంటేనే ఆయా కాలేజీల నుంచి విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారిని ప్రైవేటు అభ్యర్థులుగా పరిగణిస్తారు. తరచూ ఇదే సమస్య ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంశం కొన్నేళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర అనుమతులు లేవని దరఖాస్తులు తిరస్కరించడం, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ కోసమంటూ గుర్తింపు ఇవ్వడం ప్రహసనంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 1,475 ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో 1,010 కాలేజీలకు అధికారులు అఫిలియేషన్ ఇచ్చారు. మరో 465 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది. బహుళ అంతస్తుల భవానాల్లో నడిచే ఈ కాలేజీలకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఈ కాలేజీల్లో దాదాపు లక్షమంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ అంశంపై ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది వరకూ అఫిలియేషన్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చారు. కాగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి కాలేజీలు ప్రారంభమవడానికి ముందే అన్ని అంశాలు సమీక్షించి, అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, అఫిలియేషన్ రాకుండానే ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందే కళ్లు తెరవాలి.. అనుబంధ గుర్తింపు ప్రక్రియలో కొన్నేళ్లుగా అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల బేరసారాలతో గతంలో అధికారులు దీన్నో వ్యాపారంగా మార్చారు. ప్రస్తుత కార్యదర్శి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, కాలేజీలు తెరిచేనాటికే అర్హత ఉన్న కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలి. అర్హత లేని కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేస్తే విద్యార్థులు గందరగోళంలో పడే అవకాశం ఉండదు. – మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి, కన్వీనర్ 28 కల్లా తేల్చేస్తాం మిగిలిపోయిన కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియపై ఈ నెల 28 నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులు నష్టపోకుండా చూడాలన్నదే మా విధానం. ఇక మీదట అనుబంధ గుర్తింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి ముందునుంచే కృషి చేస్తాం. – నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి -
ఇక ముందుగానే గుర్తింపు
* అఫిలియేషన్లపై జేఎన్టీయూహెచ్ ఇన్చార్జి వీసీ శైలజారామయ్యార్ * వచ్చే ఏడాది నుంచి అమలుకు చర్యలు * అఫిలియేషన్ల ప్రక్రియను నిష్పక్షపాతంగా వ్యవహరించాం * తనిఖీ బృందాలను జంబ్లింగ్ విధానంలో ఎంపిక చేశాం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను ముందుగానే పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని జేఎన్టీయూహెచ్ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ శైలజారామయ్యార్ వెల్లడించారు. వీలైతే మే నెలలోనే ఇది పూర్తయ్యేలా చూస్తామన్నారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయంలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేదని, జేఎన్‌టీయూహెచ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమని స్పష్టంచేశారు. లోపాలపై కాలేజీలకూ ఒకటికి రెండుసార్లు తెలిపి సరిదిద్దుకోవాలని చెప్పామన్నారు. సరిదిద్దుకున్న కాలేజీలు, కోర్సులకు గుర్తింపు ఇచ్చామన్నారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను వెబ్సైట్లో ఉంచామన్నారు. ఒక కాలేజీకి సీట్లు పెంచడం, మరో కాలేజీకి తగ్గించడమేమీ లేదని, నిబంధనలు, తనిఖీల నివేదికల ప్రకారమే గుర్తింపు ఇచ్చామన్నారు. తనిఖీ బృందాలను, కాలేజీలనూ జంబ్లింగ్ విధానంలో ఎంపిక చేశామన్నారు. అఫిలియేషన్లూ ఆన్లైన్లోనే: రమణరావు వచ్చే ఏడాది నుంచి అఫిలియేషన్ల ప్రక్రియనూ ఆన్లైన్లోనే చేపడతామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎన్వీ రమణరావు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తనిఖీ బృందాల నివేదికలను ఆన్లైన్లో పెట్టి, ఆ అంశాల ఆధారంగానే ఆన్లైన్లోనే గుర్తింపు ఇవ్వడం, లేదా నిరాకరించడం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.