సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అనుమతులు లేక పెడింగ్‌లో ఉన్న 465 ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. పరీక్షలు దగ్గరపడుతున్న కారణంగానే ఈసారికి గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి కఠినంగానే వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు.
కాలేజీలు ప్రారంభమయ్యేనాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అర్హతలు పరిశీలిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో ఈ సంవత్సరం దాదాపు లక్ష మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాయాల్సిన ముప్పు తొలగిపోనుంది. ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉంటేనే ఆయా కాలేజీల నుంచి విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారిని ప్రైవేటు అభ్యర్థులుగా పరిగణిస్తారు.
తరచూ ఇదే సమస్య
ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంశం కొన్నేళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర అనుమతులు లేవని దరఖాస్తులు తిరస్కరించడం, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ కోసమంటూ గుర్తింపు ఇవ్వడం ప్రహసనంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 1,475 ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి.
వీటిలో 1,010 కాలేజీలకు అధికారులు అఫిలియేషన్ ఇచ్చారు. మరో 465 కాలేజీలు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీలో ఉన్నట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది. బహుళ అంతస్తుల భవానాల్లో నడిచే ఈ కాలేజీలకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఈ కాలేజీల్లో దాదాపు లక్షమంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ అంశంపై ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్షించారు.
ఈ ఏడాది వరకూ అఫిలియేషన్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చారు. కాగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి కాలేజీలు ప్రారంభమవడానికి ముందే అన్ని అంశాలు సమీక్షించి, అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, అఫిలియేషన్ రాకుండానే ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముందే కళ్లు తెరవాలి..
అనుబంధ గుర్తింపు ప్రక్రియలో కొన్నేళ్లుగా అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల బేరసారాలతో గతంలో అధికారులు దీన్నో వ్యాపారంగా మార్చారు. ప్రస్తుత కార్యదర్శి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, కాలేజీలు తెరిచేనాటికే అర్హత ఉన్న కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలి. అర్హత లేని కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేస్తే విద్యార్థులు గందరగోళంలో పడే అవకాశం ఉండదు.
– మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి, కన్వీనర్
28 కల్లా తేల్చేస్తాం
మిగిలిపోయిన కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియపై ఈ నెల 28 నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులు నష్టపోకుండా చూడాలన్నదే మా విధానం. ఇక మీదట అనుబంధ గుర్తింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి ముందునుంచే కృషి చేస్తాం.
– నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment