private inter colleges
-
ఈ ఏడాదికి ‘గుర్తింపు’ ఇచ్చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అనుమతులు లేక పెడింగ్‌లో ఉన్న 465 ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. పరీక్షలు దగ్గరపడుతున్న కారణంగానే ఈసారికి గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి కఠినంగానే వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. కాలేజీలు ప్రారంభమయ్యేనాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అర్హతలు పరిశీలిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో ఈ సంవత్సరం దాదాపు లక్ష మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాయాల్సిన ముప్పు తొలగిపోనుంది. ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉంటేనే ఆయా కాలేజీల నుంచి విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారిని ప్రైవేటు అభ్యర్థులుగా పరిగణిస్తారు. తరచూ ఇదే సమస్య ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంశం కొన్నేళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర అనుమతులు లేవని దరఖాస్తులు తిరస్కరించడం, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ కోసమంటూ గుర్తింపు ఇవ్వడం ప్రహసనంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 1,475 ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో 1,010 కాలేజీలకు అధికారులు అఫిలియేషన్ ఇచ్చారు. మరో 465 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది. బహుళ అంతస్తుల భవానాల్లో నడిచే ఈ కాలేజీలకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఈ కాలేజీల్లో దాదాపు లక్షమంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ అంశంపై ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది వరకూ అఫిలియేషన్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చారు. కాగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి కాలేజీలు ప్రారంభమవడానికి ముందే అన్ని అంశాలు సమీక్షించి, అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, అఫిలియేషన్ రాకుండానే ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందే కళ్లు తెరవాలి.. అనుబంధ గుర్తింపు ప్రక్రియలో కొన్నేళ్లుగా అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల బేరసారాలతో గతంలో అధికారులు దీన్నో వ్యాపారంగా మార్చారు. ప్రస్తుత కార్యదర్శి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, కాలేజీలు తెరిచేనాటికే అర్హత ఉన్న కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలి. అర్హత లేని కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేస్తే విద్యార్థులు గందరగోళంలో పడే అవకాశం ఉండదు. – మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి, కన్వీనర్ 28 కల్లా తేల్చేస్తాం మిగిలిపోయిన కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియపై ఈ నెల 28 నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులు నష్టపోకుండా చూడాలన్నదే మా విధానం. ఇక మీదట అనుబంధ గుర్తింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి ముందునుంచే కృషి చేస్తాం. – నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి -
చదువే చెప్పలేదు ఫీజు ఎలా చెల్లిస్తాం?
నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన అఖిల దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో డే స్కాలర్‌గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రూ.45 వేలు ఫీజు చెల్లించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం మాత్రం గతేడాది చెల్లించిన ఫీజుకు అదనంగా మరో ఏడువేలు కలిపి మొత్తం రూ.52 వేలు చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది. ఆన్లైన్ తరగతుల సమయంలో రూ.15 వేలు చెల్లించారు. తాజాగా వార్షిక ఫీజు గడువు రావడంతో మొత్తం ఫీజులులో 75 శాతం చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టుకుంటామని కాలేజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఒక అఖిలకు ఎదురైన సమస్యకాదు.. నగరంలో వేలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులదీ ఇదే పరిస్థితి. సాక్షి, హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో సైతం కార్పొరేట్ కాలేజీలు ఫీజుల బాదుడు ఆపడం లేదు. వార్షిక ఫరీక్ష ఫీజుకు మెలిక పెట్టి బాహాటంగానే గతేడాది కంటే అదనంగా ఫీజులను వసూలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విద్యా సంస్ధలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జీఓ నెంబర్ 52 ద్వారా స్వష్టమైన ఆదేశాలు జారీ చేసినా..ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఇంటర్మీడియట్ అధికారుల ఉదాసీన వైఖరి కార్పొరేట్ కాలేజీలకు కలిసి వస్తోంది. ఆన్లైన్ తరగతుల సమయంలోనే 10 నుంచి 20 శాతం ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభంతో ఫీజుల కోసం మరింత ఒత్తిళ్లు పెంచుతున్నారు. తాజాగా వార్షిక పరీక్ష ఫీజు గడువు రావడంతో..ఏకంగా మొత్తం ఫీజులో 75 శాతం చెల్లిస్తేనే వార్షిక పరీక్ష ఫీజు కట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేక తల్లడిల్లుతున్నారు. చదువే చెప్పలేదు ఫీజు ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. లక్షన్నర పైనే.. హైదరాబాద్ మహనగరంలో సుమారు 782కు పైగా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉండగా, అందులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు లక్షన్నరకుపైగా ఉన్నారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక ఫీజు చెల్లింపు పెద్దగా ఇబ్బంది లేకపోగా, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న వారికి మాత్రం భారంగా మారింది. కొరవడిన పర్యవేక్షణ ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజుల నియంత్రణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. నగరంలో ముగ్గురు ఇంటర్మీడియట్ అధికారులు ఉన్నప్పటికీ వారి పరిధిలోని కాలేజీలపై పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉంది. మొక్కుబడి తనిఖీలకు పరిమితమయ్యారు. ఏకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైతం పూర్తిగా అమలు చేయడంలో విఫలం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఒత్తిడి చేస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తాం’
సాక్షి, అమరావతి : స్టడీ మెటీరియల్స్, యూనిఫారాలు కొనుగోలు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్ ఇంటర్ కాలేజీ యాజమాన్యాలపై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థులు,లేదా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. మొయిల్ ద్వారా లేదా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒత్తిడి చేసే కాలేజీలపై ourbiep@gmail.comకు ఈమెయిల్ ద్వారా, 9393282578 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది. -
‘దేశంలోనే ఉత్తమ బోర్డుగా తయారు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తయారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పటికే దేశంలో బెస్ట్ డిజటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో తెలంగాణ బోర్డుకు అవార్డు లభించిందన్నారు. ఇందుకు కృషి చేసిన ఇంటర్ బోర్డు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే ఇంతటితో సంతృప్తి చెందకుండా మరింత కష్టపడాలన్నారు. నేడు ఇంటర్మీటియెట్ బోర్డు 2వ సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొని బోర్డు ప్రవేశ పెట్టిన తీర్మాణాలను ఆమోదించారు. ఇంటర్ బోర్డు సభ్య సమావేశంలో ప్రతి ఆరు నెలలకొకసారి జరగాల్సి ఉండగా రాష్ట్ర విభజన, బోర్డు పదో షెడ్యూల్లో ఉన్నందున నిర్ణీత సమయంలో సమావేశం నిర్వహించలేక పోయామని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకొకసారి ఇంటర్ బోర్డు సభ్య సమావేశం జరుగుతుందన్నారు. అదే విధంగా బోర్డు సభ్యులను కూడా ప్రస్తుత అవసరాల మేరకు మార్చుతామన్నారు. వృతివిద్య కోర్సులను మరింత పటిష్టం చేసి, కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగం వచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేస్తామన్నారు. ఇందుకోసం జేఎన్టీయు, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్చన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీ తనకు నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా కోర్సులు రూపొందించి వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు. అదే సమయంలో ఆదరణలేని వృతి విద్య కోర్సులను కూడా తొలగిస్తామని చెప్పారు. బోర్డు పిరిధిలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయన్నారు. వీటన్నింటిలో ఉన్న వసతులు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలతో ఒక్కో కాలేజీకి ఒక్కో ప్రొఫైల్ తయారు చేయిస్తామన్నారు. వాటిని ఇంటర్ వెబ్ సైట్లో పొందుపరుస్తామని, తద్వారా తల్లిదండ్రులు, విద్యార్థులు ఏయే కాలేజీల్లో ఎలాంటి కోర్సులు, వసతుల ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల్లో బోర్డు కఠినంగా ఉంటుందని తెలిపారు. సరైన వసతులు లేని కాలేజీలకు అనుమతుల ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో బోర్డుపై ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. గతంలో ప్రైవేట్ కాలేజీలు బోర్డును ఆజమాయిషీ చేసేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ కాలేజీలపై బోర్డు పట్టు సాధించిందన్నారు. నిబంధనల మేరకు నడవని కాలేజీల నుంచి భారీ ఎత్తున పెనాల్టీలు కూడా వసూలు చేశామన్నారు.