నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన అఖిల దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో డే స్కాలర్‌గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో రూ.45 వేలు ఫీజు చెల్లించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం మాత్రం గతేడాది చెల్లించిన ఫీజుకు అదనంగా మరో ఏడువేలు కలిపి మొత్తం రూ.52 వేలు చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది. ఆన్‌లైన్ తరగతుల సమయంలో రూ.15 వేలు చెల్లించారు. తాజాగా వార్షిక ఫీజు గడువు రావడంతో మొత్తం ఫీజులులో 75 శాతం చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టుకుంటామని కాలేజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఒక అఖిలకు ఎదురైన సమస్యకాదు.. నగరంలో వేలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులదీ ఇదే పరిస్థితి.
సాక్షి, హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో సైతం కార్పొరేట్ కాలేజీలు ఫీజుల బాదుడు ఆపడం లేదు. వార్షిక ఫరీక్ష ఫీజుకు మెలిక పెట్టి బాహాటంగానే గతేడాది కంటే అదనంగా ఫీజులను వసూలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విద్యా సంస్ధలు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జీఓ నెంబర్ 52 ద్వారా స్వష్టమైన ఆదేశాలు జారీ చేసినా..ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఇంటర్మీడియట్ అధికారుల ఉదాసీన వైఖరి కార్పొరేట్ కాలేజీలకు కలిసి వస్తోంది. ఆన్‌లైన్ తరగతుల సమయంలోనే 10 నుంచి 20 శాతం ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభంతో ఫీజుల కోసం మరింత ఒత్తిళ్లు పెంచుతున్నారు. తాజాగా వార్షిక పరీక్ష ఫీజు గడువు రావడంతో..ఏకంగా మొత్తం ఫీజులో 75 శాతం చెల్లిస్తేనే వార్షిక పరీక్ష ఫీజు కట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేక తల్లడిల్లుతున్నారు. చదువే చెప్పలేదు ఫీజు ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు.
లక్షన్నర పైనే..
హైదరాబాద్ మహనగరంలో సుమారు 782కు పైగా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉండగా, అందులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు లక్షన్నరకుపైగా ఉన్నారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక ఫీజు చెల్లింపు పెద్దగా ఇబ్బంది లేకపోగా, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న వారికి మాత్రం భారంగా మారింది.
కొరవడిన పర్యవేక్షణ
ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజుల నియంత్రణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. నగరంలో ముగ్గురు ఇంటర్మీడియట్ అధికారులు ఉన్నప్పటికీ వారి పరిధిలోని కాలేజీలపై పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉంది. మొక్కుబడి తనిఖీలకు పరిమితమయ్యారు. ఏకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైతం పూర్తిగా అమలు చేయడంలో విఫలం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment