‘దేశంలోనే ఉత్తమ బోర్డుగా తయారు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తయారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పటికే దేశంలో బెస్ట్ డిజటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో తెలంగాణ బోర్డుకు అవార్డు లభించిందన్నారు. ఇందుకు కృషి చేసిన ఇంటర్ బోర్డు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే ఇంతటితో సంతృప్తి చెందకుండా మరింత కష్టపడాలన్నారు.
నేడు ఇంటర్మీటియెట్ బోర్డు 2వ సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొని బోర్డు ప్రవేశ పెట్టిన తీర్మాణాలను ఆమోదించారు. ఇంటర్ బోర్డు సభ్య సమావేశంలో ప్రతి ఆరు నెలలకొకసారి జరగాల్సి ఉండగా రాష్ట్ర విభజన, బోర్డు పదో షెడ్యూల్‌లో ఉన్నందున నిర్ణీత సమయంలో సమావేశం నిర్వహించలేక పోయామని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకొకసారి ఇంటర్ బోర్డు సభ్య సమావేశం జరుగుతుందన్నారు. అదే విధంగా బోర్డు సభ్యులను కూడా ప్రస్తుత అవసరాల మేరకు మార్చుతామన్నారు.
వృతివిద్య కోర్సులను మరింత పటిష్టం చేసి, కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగం వచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేస్తామన్నారు. ఇందుకోసం జేఎన్టీయు, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్చన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీ తనకు నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా కోర్సులు రూపొందించి వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు. అదే సమయంలో ఆదరణలేని వృతి విద్య కోర్సులను కూడా తొలగిస్తామని చెప్పారు. బోర్డు పిరిధిలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయన్నారు.
వీటన్నింటిలో ఉన్న వసతులు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలతో ఒక్కో కాలేజీకి ఒక్కో ప్రొఫైల్ తయారు చేయిస్తామన్నారు. వాటిని ఇంటర్ వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని, తద్వారా తల్లిదండ్రులు, విద్యార్థులు ఏయే కాలేజీల్లో ఎలాంటి కోర్సులు, వసతుల ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల్లో బోర్డు కఠినంగా ఉంటుందని తెలిపారు. సరైన వసతులు లేని కాలేజీలకు అనుమతుల ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో బోర్డుపై ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. గతంలో ప్రైవేట్ కాలేజీలు బోర్డును ఆజమాయిషీ చేసేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ కాలేజీలపై బోర్డు పట్టు సాధించిందన్నారు. నిబంధనల మేరకు నడవని కాలేజీల నుంచి భారీ ఎత్తున పెనాల్టీలు కూడా వసూలు చేశామన్నారు.