జేఎన్‌టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ శైలజారామయ్యార్
* అఫిలియేషన్లపై జేఎన్‌టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ శైలజారామయ్యార్
* వచ్చే ఏడాది నుంచి అమలుకు చర్యలు
* అఫిలియేషన్ల ప్రక్రియను నిష్పక్షపాతంగా వ్యవహరించాం
* తనిఖీ బృందాలను జంబ్లింగ్ విధానంలో ఎంపిక చేశాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను ముందుగానే పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని జేఎన్‌టీయూహెచ్ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ శైలజారామయ్యార్ వెల్లడించారు. వీలైతే మే నెలలోనే ఇది పూర్తయ్యేలా చూస్తామన్నారు.
శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయంలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేదని, జేఎన్‌టీయూహెచ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమని స్పష్టంచేశారు. లోపాలపై కాలేజీలకూ ఒకటికి రెండుసార్లు తెలిపి సరిదిద్దుకోవాలని చెప్పామన్నారు. సరిదిద్దుకున్న కాలేజీలు, కోర్సులకు గుర్తింపు ఇచ్చామన్నారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.
ఒక కాలేజీకి సీట్లు పెంచడం, మరో కాలేజీకి తగ్గించడమేమీ లేదని, నిబంధనలు, తనిఖీల నివేదికల ప్రకారమే గుర్తింపు ఇచ్చామన్నారు. తనిఖీ బృందాలను, కాలేజీలనూ జంబ్లింగ్ విధానంలో ఎంపిక చేశామన్నారు.
అఫిలియేషన్లూ ఆన్‌లైన్‌లోనే: రమణరావు
వచ్చే ఏడాది నుంచి అఫిలియేషన్ల ప్రక్రియనూ ఆన్‌లైన్‌లోనే చేపడతామని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తనిఖీ బృందాల నివేదికలను ఆన్‌లైన్‌లో పెట్టి, ఆ అంశాల ఆధారంగానే ఆన్‌లైన్‌లోనే గుర్తింపు ఇవ్వడం, లేదా నిరాకరించడం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.