అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
-
మృతదేహంతో బంధువుల ఆందోళన
పరకాల : అనుమానాస్పద స్థితిలో ఓ డిగ్రీ విద్యార్థిని మృతిచెందిన సంఘటన రేగొండ మండలంలోని చిన్నకొడెపాక శివారు విజ్జయ్యపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. రేగొండ మండలంలోని చిన్నకోడెపాక శివారు విజ్జయ్యపల్లికి చెందిన బైకాని పోషాలు కుమార్తె సంధ్య(20) పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలో సెకండియర్ చదువుతోంది. కళాశాలకు చెందిన బస్సులోనే రోజు అప్ అండ్ డౌన్ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజూలాగే కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన సంధ్య పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతిచెందింది. ఇంట్లో ఎలాంటి గొడవలు లేక పోవడంతో కళాశాలలోనే ఏమో జరిగి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఎస్వీ కళాశాల ఎదుట సంధ్య మృతదేహాన్ని వేసి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ నర్సింహులు, ఎస్‌సై సుధాకర్ కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. సంధ్య మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి మృతదేహాన్ని తొలగించేది లేదని స్పష్టం చేయడంతో పోలీసులు వెనుదిరిగారు. రాత్రి వరకు బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు.