ద్వితీయ భాషను కొనసాగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : డిగ్రీ 4వ సెమిస్టర్‌లో ద్వితీయ భాషను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భాషా పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుకు విజ్ఞప్తి చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా సంఘ కార్యదర్శి పి.దేవేంద్ర గుప్తా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన సీబీసీఎస్ సెమిస్టర్ విధానంలోని పాఠ్య ప్రణాళికలో ద్వితీయ భాషలైన తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ 4వ సెమిస్టర్‌లోని పాఠ్యాంశాల నుంచి తొలగించబడ్డాయని పేర్కొన్నారు. భాషా సాహిత్యం అధ్యయనం చేయకుంటే విద్యార్థులకు విషయ పరిజ్ఞానం లోపిస్తుందన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కేఎస్ లక్ష్మణరావును కలిసిన వారిలో డాక్టర్ సీహెచ్ ప్రవీణ్, సుభాష్ చౌహాన్, డాక్టర్ ఏ అంజనీకుమార్, డాక్టర్ పి.కిషోర్, జేవీ సుధీర్ కుమార్, జి.బలరామకృష్ణ, శ్రీరంగనాయకి, ఆర్‌జే శైలజ, వెంకటరత్నం తదితరులున్నారు.