
స్మృతికి ఝలక్ ఇచ్చిన స్టూడెంట్
జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్ పర్యటనకు ముందే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఓ విద్యార్థి ఝలక్ ఇచ్చాడు. కేంద్రమంత్రి సోమవారం ఇస్లామిక్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అయితే మంత్రి నుంచి ఎంబీఏ పట్టా తీసుకోబోనని ఓ విద్యార్థి ప్రకటించాడు. అందుకుగల కారణాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి 2008లో సమీర్ గోజ్వారీ అనే విద్యార్థి ఎంబీఏ పూర్తి చేశాడు. సోమవారం కేంద్రమంత్రి చేతుల మీదగా సమీర్ పట్టా అందుకోవాల్సివుంది. భావప్రకటన స్వేచ్ఛపై దేశం జరుగుతున్న దాడులకు నిరసనగా తాను పట్టా తీసుకోవడం లేదంటూ సమీర్ ప్రకటించాడు. సాహిత్య అకాడమి అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్న రచయితలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.
ఓ విద్యార్థి తన జీవితంలో మాస్టర్ డిగ్రీను అందుకోవడంలో ఉన్న ఆనందం.. మిగతా ఏ ముఖ్యమైన అవార్డు అందుకున్నప్పుడు ఉండదన్నాడు. కానీ దేశంలో భావప్రకటన స్వేచ్ఛకు విలువలు తగ్గడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై స్మృతి ఇరానీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కాగా, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీనగర్ అధికారులతో పాటు యూనివర్సిటీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.