
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ డిగ్రీలు చదివితే వెంటనే ఉపాధి లభించదు.. దీని కన్నా సాంకేతిక విద్య అభ్యసిస్తే తొందరగా జాబ్ వస్తుంది.. ఇలాంటి వాటికి ఇక ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే బీఏ, బీఎస్సీ, బీకాం వంటి సంప్రదాయ డిగ్రీలు కొత్త రూపం దాల్చాయి. బీఏ, బీఎస్సీతో పాటు కంప్యూటర్స్ చదువుకోవచ్చు.. టూరిజం ట్రావెల్ మేనేజ్‌మెంట్ చదవొచ్చు.. ఎన్జీవోస్ ఎడ్యుకేషన్ చదవొచ్చు.. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు.. ఇలా ఒక్కటేమిటి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న 72 రకాల కోర్సులను సంప్రదాయ డిగ్రీ, పీజీలో చదువుకునే అవకాశం వచ్చింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) కోర్ సిలబస్‌తో పాటు ఉపాధి అవకాశాలు ఉండే సబ్జెక్టులను చదువుకునే వీలు ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ సహా మరికొన్ని యూనివర్సిటీలు సంప్రదాయ డిగ్రీలను రీడిజైన్ చేశాయి. ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని సైన్స్ గ్రూపుల్లో ప్రవేశ పెట్టగా, మిగతా అన్ని యూనివర్సిటీలు, అన్ని గ్రూపుల్లో 3, 4 సెమిస్టర్లలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఇక పూర్తి స్థాయిలో అమలు..
సంప్రదాయ డిగ్రీలు, పీజీలు చదివే వారు తమ రెగ్యులర్ డిగ్రీలతో పాటు నచ్చిన సబ్జెక్టును చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం సీబీసీఎస్‌ను గతేడాది అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఉన్నత విద్యా మండలి సీబీసీఎస్ అమలుకు చర్యలు చేపట్టింది. సెమిస్టర్ విధానంతో పాటు కోర్సులను రీడిజైన్ చేసింది.
తాజాగా పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు యూనివర్సిటీలు చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో మార్పులు చేసింది. కంప్యూటర్ అప్లికేషన్స్, రైటింగ్ స్కిల్స్, హిస్టరీ అండ్ టూరిజం, లా అండ్ ఎథిక్స్ వంటి సబ్జెక్టులు అందుబాటులోకి తెచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో వీటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
పోటీ పరీక్షలే అక్కర లేదు..
ఇప్పటివరకు ఆర్ట్స్ గ్రూప్‌లు చదివిన విద్యార్థులు ఎక్కువ మంది బీఎడ్ వంటి వృత్తి విద్యా కోర్సులు చేయడంతో పాటు గ్రూప్–1, గ్రూప్–2, సివిల్స్ తదితర పోటీ పరీక్షలకే ఎక్కువగా సిద్ధమయ్యేవారు. లక్షల మందిలో కొద్దిమందికే ఉద్యోగ అవకాశాలు లభించేవి. మిగతా వారంతా నిరుద్యోగులుగానే ఉండిపోయే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో కోర్సుల రీడిజైన్ వారికి వరంగా మారనుంది. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. స్వయం ఉపాధి పొందే వీలు కూడా ఉండనుంది.
2.2 లక్షల మందికి ప్రయోజనం..
ప్రస్తుతం రాష్ట్రంలోని 1,184 డిగ్రీ కాలేజీల్లో 2.2 లక్షల మంది ఏటా చేరుతున్నారు. వారంతా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ తదితర కోర్సులను చదువుతున్నారు. అందులోని 57 రకాల రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు ఇకపై ఉపాధి అవకాశాలు కల్పించే 72 సబ్జెక్టులు అందుబాటులోకి వస్తాయి. సీబీసీఎస్‌లో భాగంగా వాటిని విద్యార్థులు ఎలెక్టివ్ సబ్జెక్టులుగా తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
కొన్ని ప్రతిపాదిత కొత్త సబ్జెక్టులు..
కంప్యూటర్ అప్లికేషన్స్, హిస్టరీ అండ్ టూరిజం, మీడియా స్టడీస్, లా అండ్ ఎథిక్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, అప్పరల్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్, ఫుడ్ టెక్నాలజీ, ఎన్జీవోస్ ఎడ్యుకేషన్, ఫిల్మ్ మేకింగ్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, పబ్లిక్ ఒపీనియన్ అండ్ సర్వే మెథడ్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, రీసెర్చ్ మెథడాలజీ, నర్సరీ అండ్ గార్డెనింగ్, హెర్బల్ టెక్నాలజీ.
ముందువరుసలో ఉస్మానియా
కోర్సుల రీడిజైన్ విష యంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు వరుసలో ఉంది. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెస ర్ ఎస్.రామచంద్రం నేతృత్వంలో అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం బీఎస్సీ మూడో సెమిస్టర్‌లో 15 రకాల కోర్సుల్లో ఉపాధి కల్పించే సబ్జెక్టులను (స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సు– ఎస్‌ఈసీ) ప్రవేశ పెట్టారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆర్ట్స్, కామర్స్‌లో నూ అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెం బర్‌లో జరిగే అకడమిక్ సెనేట్‌లో వీటికి ఆమోదం తెలిపే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment