
అడవిలో ఒక రోజు
పట్టుకోండి చూద్దాం
‘‘నువ్వు ఎన్నయినా చెప్పు... రణగొణ ధ్వనుల ఈ పట్టణ జీవితమంటే విరక్తి పుడుతుంది నాకు. ఈ కాంక్రిట్ జంగల్‌ని విడిచి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లి వద్దాం. ఏమంటావు?’’ అన్నాడు విజయ్. ‘‘ఇల్లే ప్రపంచం అనుకునే నువ్వే ఇలా అంటున్నావంటే మనం కచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాల్సిందే’’ అన్నాడు రాజ్. ‘‘ఎక్కడికి వెళదాం?’’ అడిగాడు విజయ్. ‘‘ ఈ కాంక్రిట్ జంగల్‌ని వదిలి నిజమైన జంగల్‌కే వెళదాం. కేరళ ఫారెస్ట్‌కు వెళదాం’’ అన్నాడు రాజ్. ‘‘ఏరా... నీ అభిప్రాయం ఏమిటి’’ అని శక్తి కుమార్‌ని అడిగారు ఇద్దరు.
ఎప్పటిలాగే శక్తి శూన్యంలోకి చూశాడు.
‘‘వీడికి శక్తి అని పేరు పెట్టినోడ్ని యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. వీడికి బాగా సరిపొయ్యే పేరు... లేజీ కుమార్ లేదా శక్తిహీన్’’ అని తాను నవ్వుతూ విజయ్‌ని నవ్వించాడు రాజ్. ‘‘ఏమిటిరా మీ గోల?’’ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు శక్తి. విషయం చెప్పారు. ‘‘ ఓకే’’ చెప్పాడు శక్తి. రెండు రోజుల తరువాత... ముగ్గురు హైదరాబాద్ దాటారు.
కేరళలో ఒక అడవి. ‘‘ఇక్కడ ఒక నెల ఉంటే చాలు పదకొండు నెలలు పచ్చగా,ఆరోగ్యంగా బతకవచ్చు’’ అనుకున్నారు ముగ్గురు. ఇప్పుడు మనం ఈ ముగ్గురు మిత్రుల గురించి ఒకసారి చెప్పుకోవాలి. విజయ్, రాజ్, శక్తి బాల్య మిత్రులు. డిగ్రీ తరువాత కొంత కాలం రాత్రీ పగలు నిరుద్యోగం చేశారు. ఇంట్లో వాళ్లు తిట్టడంతో ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకొని, అనుకున్నంత పని చేశారు. అయితే నెల తిరక్కుండానే ముగ్గురూ...తాము చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారు.
ఆరోజు సాయంత్రం ముగ్గురు ఎప్పటిలాగే ట్యాంక్‌బండ్ మీద ఉన్న బెంచి మీద కూర్చున్నారు. ‘‘మనకు ఉద్యోగం చేయడం రాదు. వచ్చినా అది అట్టే కాలం నిలవదు. చూశారు కదా... ఒక్క నెల కూడా ఉద్యోగం చేయలేకపోయాం. నేను అనేది ఏమిటంటే, మనం ముగ్గురం ఏదైనా వ్యాపారం మొదలు పెడితే మంచిదని’’ అన్నాడు విజయ్. ‘‘గుడ్ ఐడియా’’ అని విజయ్‌ని ప్రశంసించాడు రాజ్. ‘‘నువ్వేమంటావు?’’ ఎప్పటిలాగే శక్తిని ప్రశ్నించారు ఇద్దరు.‘‘ఓకే’’ ఎప్పటిలాగే సమాధానం ఇచ్చాడు శక్తి.
స్నేహితుల దగ్గర అప్పులు చేసి వ్యాపారం ప్రారంభించారు. పెద్దగా పోటీ లేకపోవడంతో అదృష్టవశాత్తు అయిదు సంవత్సరాలు తిరక్కుండానే ముగ్గురు లక్షాధికారులయ్యారు. వ్యాపారం వృద్ధి అవుతున్న కొద్దీ వారి స్నేహం పలచబారడం మొదలైంది. వ్యాపారం మీద ఆధిపత్యం కోసం చాప కింద నీరులా ముగ్గురు ఎవరి ప్రయత్నాలు వారు చేయడం మొదలైంది. ‘‘ఈ ఇద్దరినీ చంపితే... వ్యాపారమంతా నాదైపోతుంది...నేను కోటీశ్వరుడిని కావచ్చు’’ అని ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ఆలోచించడం మొదలైంది.
తమ ఆలోచన ఆచరణలోకి రావడానికి వారికి అవకాశం వచ్చింది.
‘‘ఇంతకు మించి మంచి అవకాశం ఎప్పుడూ రాదు’’ అనుకున్నారు ముగ్గురు. ‘రాజ్, విజయ్‌లను ఎలా చంపాలి?’ అనే దాని గురించి శక్తి, ‘శక్తి, విజయ్‌లను ఎలా చంపాలి?’ అనేదాని గురించి రాజ్, ‘రాజ్, శక్తిలను ఎలా చంపాలి?’ అనేదాని గురించి విజయ్ మంచి పథకం రూపొందించుకున్నారు. అడవిలో ఒక చిన్న క్యాబిన్‌లో ముగ్గురు బస చేశారు. ఆరాత్రి ముగ్గరు బాగా తాగి, తిని నిద్రపోయారు.
వాళ్లు గాఢంగ నిద్రలో ఉన్న సమయంలో అడవి అంటుకొంది. అదృష్టవశాత్తు ఆ క్యాబిన్ మంటల్లో చిక్కుకోలేదు. మరుసటి రోజు.... ఆ ముగ్గురు క్యాబిన్‌లో శవాలై కనిపించారు. వారు చనిపోవడానికి మంటలు కారణం కాదు. అలా జరిగి ఉంటే బూడిదైపోయేవారు. ఒకరిని ఒకరు పొడుచుకొని చనిపోయారు అని చెప్పడానికి ఒక్క చిన్న ఆధారం కూడా లేదు. వాళ్లు తాగిన మందు, ఆహారపదార్థాల్లో విషపదార్థాల జాడేది లేదు. ఆ అడవిలో క్రూరమృగాలు కూడా లేవు. విషసర్పాలేవీ కుట్టలేదు. మరి ఆ ముగ్గురు ఎలా చనిపోయినట్లు?!
కారణం: స్మోక్ ఇన్హేలేషన్.. పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు.