- మానసిక ఒత్తిడితోనే సత్యనారాయణకు అనారోగ్యం
- కుటుంబీకుల నడుమ అనుబంధంతోనే మిగతా వారి ఆత్మహత్య
బంధాలకు దూరం.. ఓదార్పు కరువు
Published Mon, Aug 1 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
జనగామ : ఉద్యోగం నుంచి సస్పెన్షన్ గురై.. ఇటు తల్లిదండ్రులు, బంధువుల అనుబంధానికి దూరమైన నేపథ్యంలో ఓదార్చే వారు లేకే హౌసింగ్ డీఈ సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన గృహ నిర్మాణ శాఖ డీఈ పారుపల్లి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే, సత్యనారాయణతో ఆయన భార్య, పిల్లలకు అనుబంధం కారణంగా ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా, మరేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో బంధువులకు ఫోన్ చేశారా.. చేయలేదంటే కారణమేమిటనే కోణంలో విచారణ జరగాల్సి ఉంది. సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించగా.. చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లే క్రమంలో అక్కడే ఉంటున్న సోదరులిద్దరికి ఎందుకు ఫోన్ చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. హన్మకొండ నుంచి బదిలీపై కరీంనగర్‌కు వెళ్లిన సత్యనారాయణ పదేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో.. కుటుంబ పోషణ, పిల్లల చదవుల కోసం చేసిన అప్పులు భారంగా మారడం.. ఇటు తల్లిదండ్రులు, సోదరులు, బంధువులతో కలిసేందుకు ఇష్టపడని భార్య.. తదితర కారణాలతో మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్యనారాయణ డీఈగా పనిచేసిన హన్మకొండ, నల్లగొండ, కరీంనగర్‌లల్లో సస్పెన్షన్ గురికాగా.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
కుటుంబానికి 400 కిలోమీటర్ల దూరం
సస్పెన్షన్ గురైన సత్యనారాయణకు దశాబ్ద కాలం తర్వాత పది రోజుల క్రితమే ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ హౌజింగ్ డీఈగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడకు వెళ్లిన ఆయన ఒంటరితనంతో మనోవేదనకు గురయ్యారని తెలుస్తోంది. కుటుంబానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యనారాయణకు ఓదార్పు కరువైపోయిది. దీంతో డిఫ్రెషన్‌కు లోనైన ఆయనను కంట్రోల్ చేసే వారు లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండొచ్చని సమాచారం. కాగా, జూలై 26న సత్యనారాయణ కారు కొనుగోలు చేశారు. కుమార్తెలు, కుమారుడి కోరిక మేరకు కారు కొన్న ఆయన.. నాలుగు రోజులకే ఆ కుటుంబం మెుత్తం కానరాని లోకాలకు వెళ్లిపోవడం గమనార్హం. కాగా, సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందితే.. ఆయన మృతిని తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారా, లేక అమ్మ మాటకు కట్టుబడి రైలుకు ఎదురువెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కారులో ఎక్కించుకుని ఉదయమే ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా సాయంత్రం వరకు నేషనల్ హైవేపై తిరుగుతూ నల్లగొండ జిల్లా భువనగిరి ఆస్పత్రికి సాయంత్రం ఎందుకు తీసుకువెళ్లారనే సమాధానం లోకంలో లేని ఆ కుటుంబంతో పాటే సమాధి అయిపోయింది. కాగా, సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాల నుంచి రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ పోలీసులు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అందులోని కాల్‌డేటా వెలుగు చూస్తే తప్ప సత్యనారాయణను హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఫోన్లలో మాట్లాడారా అనేది తెలుస్తుంది. తద్వారా ఆయన కుటుంబం ఆత్మహత్మకు కారణాలు తెలియెుచ్చని భావిస్తున్నారు.
Advertisement
Advertisement