
జొన్నవాడలో ఆన్‌లైన్ విధానంపై అవగాహన కల్పిస్తున్న డీకేడబ్ల్యూ కళాశాల అ«ధ్యాపకులు
గతంలో డిగ్రీలో చేరాలంటే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలకు వెళ్లి సీట్లు ఉన్నా యో లేదో తెలుసుకుని దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఈ ఏడాది నుంచి ఈ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యలో కేంద్రీకరణ ప్రవేశ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఏ సమయంలోనైనా డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకునే వెసులబాటును కల్పించింది.
నెల్లూరు(టౌన్): జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ, తొమ్మిది ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో బీఏలో 1,192, బీకాంలో 1,660, బీఎస్సీలో 2,644 కలిపి మొత్తం 5,496 సీట్లు ఉన్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ తరహాలో పారదర్శకంగా ఉండేలా కేంద్రీకరణ ప్రవేశ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అకడమిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఏపీఎస్‌ఏఎంఎస్)గా నామకరణం చేసి ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని ఈనెల 5వ తేదీనుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించారు. 29వ తేదీ ఎంపికైన వారి తొలి జాబితాను ప్రచురించనున్నారు. ఈ నెల 31వ తేదీలోపు సీటు పొందిన కళాశాలలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చేనెల 3న ఎంపికైన వారి రెండో జాబితాను ప్రచురిస్తారు. 5వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు జూన్ మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరించి ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ 10వ తేదీకల్లా పూర్తి చేస్తారు.
జిల్లాలో 18 ప్రభుత్వ,ఎయిడెడ్ కళాశాలలు
జిల్లా వ్యాప్తంగా 18 ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డీకేడబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నెల్లూరు), ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(గూడూరు), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నాయుడుపేట), శ్రీ వీఎస్‌ఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సూళ్లూరుపేట), విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (వెంకటగిరి), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (రాపూరు), వైకేఆర్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కోవూరు), పీఆర్‌ఆర్‌వీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (విడవలూరు), ఎంఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఉదయగిరి) ఉన్నాయి. అదేవిధంగా ఎయిడెడ్‌కు సంబంధించి వీఆర్ డే కళాశాల (నెల్లూరు), వీఆర్ ఈవినింగ్ కళాశాల (నెల్లూరు), ఎస్‌వీజీఎస్ డిగ్రీ కళాశాల (నెల్లూరు), శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాల (నెల్లూరు), ఎన్‌బీకేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల (విద్యానగర్), డాక్టర్ ఎస్‌ఆర్‌జే డిగ్రీ కళాశాల (ఆత్మకూరు), వేద సంస్కృత ఓరియంటల్ కళాశాల (నెల్లూరు), జవహర్ భారతి డిగ్రీ కళాశాల (కావలి), డీఆర్‌డబ్ల్యూ డిగ్రీ కళాశాల (గూడూరు) ఉన్నాయి.
దరఖాస్తు చేసే విధానం
ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ap.gov.in/admissions వెబ్‌సైట్‌ను రూపొందించింది. వైబ్‌సైట్‌లోకి Ðð వెళ్లి తొలుత రిజిస్టర్ చేసుకుంటే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ తరువాత లాగిన్ అయితే డిగ్రీ అడ్మిషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాం కనిపిస్తుంది. దానిలో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రయార్టీ ప్రకారం వరుసగా ఐదు కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రయార్టీ ప్రకారం వచ్చే దరఖాస్తు పత్రంలో విద్యార్థి ఆధార్ సంఖ్య, హాల్ టికెట్ నంబరు, జనన, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ఉంటే వాటి పత్రాలు, దివ్యాంగులైతే వాటి పత్రం, తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్‌మిట్ చేసిన తరువాత చలానా జనరేట్ అవుతుంది. చలానా తీసుకుని మీసేవ, ఈసేవా కేంద్రాల్లో రూ.50లు చెల్లించాల్సి ఉంది. ఆ తరువాత సీటు కేటాయింపు వివరాలు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తారు.
విద్యార్థుల కోసం క్యాంపెయిన్
విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చుకునేందుకు ఆయా కళాశాలల్లో అధ్యాపకులు క్యాంపెయిన్ బాట పట్టారు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 266 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో 35మంది నేరుగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోగా, 231 మందికి ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్లో దరఖాస్తు చేశారు. మరింత మంది విద్యార్థులను చేర్చుకునేందుకు అధ్యాపకులు ఇంటర్ పాసైన విద్యార్థుల వివరాలను సేకరించి వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈనెలాఖరు వరకు సమీప ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ చేర్చేందుకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు పలువురు అధ్యాపకులు తెలిపారు.
ఎక్కడినుంచైనాదరఖాస్తు చేసుకోవచ్చు
ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ చేరేందుకు రాష్ట్రంలో ఎక్కడునుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా సులువుగా ప్రవేశం పొందవచ్చు. ప్రయార్టీ ప్రకారం ఒక్కో విద్యార్థి ఐదు కళాశాలలను ఎంపిక చేసుకునే వెసులబాటును కల్పించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ విధానంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆయా కళాశాలల్లో సీట్లు మిగిలి ఉంటే ఈ నెల 25వ తేదీ తరువాత దరఖాస్తు చేసుకోవచ్చు. –మస్తానయ్య, ప్రిన్సిపల్‌డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment