డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్‌.. | An international look at degree names | Sakshi
Sakshi News home page

డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్‌..

Published Fri, May 31 2024 4:50 AM | Last Updated on Fri, May 31 2024 4:50 AM

An international look at degree names

అమెరికా తరహాలో బీఎస్, ఎంఎస్‌గా మార్పులు..  

నూతన జాతీయ విద్య విధానంలోనూ ప్రస్తావన..  

అన్ని వర్సిటీలూ పాటించాలని యూజీసీ సూచన 

సాక్షి, హైదరాబాద్‌: సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సులైన బీఏ, బీకాం, బీబీఎం, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏలకు త్వరలో కొత్త పేర్లు రానున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ) అమల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా వాటి పేర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇకపై ఆయా కోర్సులను అమెరికాలో పిలుస్తున్న తరహాలో బీఎస్, ఎంఎస్‌గా పిలవనున్నారు. 

ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది. దేశంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు లేదా ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకే ఇలా పేర్లు మార్చనున్నారు. 

విస్తృత కసరత్తు అనంతరం.. 
సంప్రదాయ కోర్సుల పేర్ల వల్ల కలిగే ఇబ్బందులపై జాతీయ నూతన విద్యా విధానం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. క్రెడిట్‌ విధానం అమలు చేయాలని సూచించిన ఈ విధానం.. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న విద్యావిధానం భారత్‌లోనూ ఉండాలని కేంద్రానికి సూచించింది. ఈ సూచనల మేరకు గతేడాది యూజీసీ నిపుణులతో ఓ కమిటీని నియమించింది.

అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులు అక్కడ గుర్తించే డిగ్రీలకన్నా భిన్నంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లు మార్చాలని ప్రతిపాదించింది. స్పెషలైజేషన్‌ చేసే విద్యార్థులకు దీనివల్ల అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. 

యూజీసీ సూచనలు ఇలా.. 
» దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీల కొత్త విధానంపై యూజీసీ లేఖ రాసింది. ఇప్పటివరకు దేశంలో మూడేళ్ల కాలపరిమితి డిగ్రీ కోర్సులున్నాయి. వాటి స్థానంలో ఆనర్స్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. వాటి కాలపరిమితి నాలుగేళ్లు. సంబంధిత సబ్జెక్టులో లోతుగా అధ్యయనం చేసేలా కోర్సును నిర్వహించడం ఆనర్స్‌ కోర్సుల ఉద్దేశం. 

»   ఉదాహరణకు బీకాం ఆనర్స్‌ అనే కోర్సులో సాధారణ కోర్సుతోపాటు నిపుణులు, వివిధ వర్గాల అనుభవజ్ఞులతో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఉండేలా కోర్సును రూపొందిస్తారు. మన రాష్ట్రంతోపాటు అనేక రాష్ట్రాల్లో బీఏ, బీకాం ఆనర్స్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. 

»    ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొన్ని కోర్సులూ అమల్లోకి వచ్చాయి. ఇష్టమైన సబ్జెక్టును ఆన్‌లైన్‌ ద్వారా ఏ దేశంలోని వర్సిటీ నుంచైనా చేసే వీలు కల్పి0చారు. ఇలా ప్రపంచ స్థాయిలో విద్యావిధానం ఏకీకృతం అవుతున్న నేపథ్యంలో బీఏ, బీకాంలను బీఎస్, ఎంఎస్‌లుగా మార్చాలని యూజీసీ భావిస్తోంది. 

»   రాష్ట్రంలోనూ ఇందుకు అనుగుణంగా కొన్ని కోర్సుల్లో మార్పులు చేస్తున్నారు. మల్టీ డిసిప్లినరీ కోర్సులను ఎంచుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఉదాహరణణకు ఒక విద్యార్థి చరిత్ర, భౌతిక శాస్త్రం, కామర్స్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకొనే విధానం తీసుకొస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ డిగ్రీని స్పెషలేషన్‌ సబ్జెక్టులుగా పేర్కొనాల్సి వస్తోంది. కాబట్టి బీఎస్, ఎంఎస్‌ వంటి పేర్లు మార్చడం వల్ల అన్ని దేశాల్లో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనికి అన్ని రాష్ట్రాలూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement