
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. యాజమాన్యాల నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. అలాగే అదనపు సీట్లు, సెక్షన్లు కూడా మంజూరు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అలాగే పీజీ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు చేసేందుకు కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్సుల విత్‌డ్రా, మీడియం మార్పు కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.
అయితే గత విద్యా సంవత్సరంలో 60 శాతం ప్రవేశాలున్న కాలేజీల్లోనే కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే సీట్లను పెంచనున్నట్లు మండలి వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది 50 నుంచి 60 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 110 వరకు ఉండగా, 60 నుంచి 70 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 90 వరకు ఉన్నాయి.
70 నుంచి 80 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు 67 ఉండగా, 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అయిన కాలేజీలు 50 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కాలేజీలో సగటున 100 సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని, దాంతో డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 20 వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే కోర్సులను ఉపసంహరించుకునేవి పరిగణనలోకి తీసుకుంటే 5 వేల వరకు సీట్లు తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. మరోవైపు మండల పరిధిలో డిగ్రీ కాలేజీలను షిఫ్ట్ చేసుకునేందుకు 40 వరకు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment