ఫీజు బకాయిలు, డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళానికి నిరసనగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలను గురువారం నుంచి శనివారం వరకు (మూడు రోజులు) బంద్ చేయాలని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో ఆదివారం కలుపుకొని నాలుగు రోజులపాటు కాలేజీలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయనందుకు నిరసనగా, డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కారణంగా 20 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందలేని పరిస్థితి కల్పించిన అధికారుల వైఖరిని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి వెల్లడించారు.
బుధవారం హైదరాబాద్‌లో జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి కాలేజీ యాజమాన్యాలకు రావాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హామీ ఇచ్చినా బకాయిలు విడుదల కాకపోవడం దారుణమన్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి ఈ-పాస్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. డిగ్రీ ప్రవేశాల్లో ఆన్‌లైన్ విధానంపై అవగాహన లేక వేల మంది విద్యార్థులు కాలేజీల్లో సీట్లు రాక నష్టపోయారని, వారికి మళ్లీ ప్రవేశాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
మూడు రోజులు కాలేజీలు బంద్
Published Thu, Sep 1 2016 2:30 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement