సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్షల విధానంపై క్షేత్రస్థాయి అధ్యయనానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సారథ్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) పరిశీలనకు ఉపక్రమించింది. ఐఎస్‌బీ ప్రతినిధి బృందం సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రితో సమావేశమై అధ్యయన విధివిధానాలపై చర్చించింది. త్వరలోనే అన్ని వర్సిటీల ఉప కులపతులు, అధికారులతో చర్చించాలని ఈ భేటీలో నిర్ణయించారు.
డిగ్రీలో పరీక్ష విధానంపై సమగ్ర అధ్యయనం చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఐఎస్‌బీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాత వాస్తవ పరి స్థితి, డిగ్రీ పరీక్షల్లో తేవాల్సిన మార్పులపై ఐఎస్‌బీ నివేదిక సమర్పించనుంది. ఈ పరిశీలన 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు.
తేడా ఎక్కడ?: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల సీట్లుండగా అందులో ఏటా సగటున 2 లక్షల మంది చదువుతున్నారు. అయితే డిగ్రీ ఉత్తీర్ణుల్లో కనీసం 10 శాతం మంది కూడా నైపుణ్య ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మొత్తంమీద 40 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యం ఉండటం లేదని, పారిశ్రామిక అవసరాలు, వృత్తి నిపుణులకు మధ్య అంతరం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. డిగ్రీ పరీక్ష విధానంలోనే మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్‌బీ ఉన్నత విద్యలో పరీక్ష విధానాన్ని పరిశీలించనుంది.
అధ్యయనం సాగేది ఇలా...
► తొలి దశలో ఐఎస్‌బీ సర్వే బృందాలు ఆరు డిగ్రీ కాలేజీలపై అధ్యయనం చేస్తాయి.
► ఇందులో రెండు అటానమస్, రెండు ఎయిడెడ్, ఇంకో రెండు ప్రైవేటు కాలేజీలుంటాయి.
► ప్రతి విభాగంలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలను ఎంచుకుంటాయి.
► ఆ తర్వాత 100 కాలేజీలకు 500 ప్రశ్నలతో కూడిన సర్వే పత్రాలు పంపుతాయి.
► డిగ్రీ తర్వాత ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? విద్యా ర్థులు ఏ తరహా పరీక్ష విధానం ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పరీక్షల తీరును ఎలా అభివృద్ధి చేయాలి? వంటి ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సమాధానాలు కోరుతాయి.
► పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాల గురించి కూడా సర్వే బృందాలు తెలుసుకోనున్నాయి.
► ఈ ప్రక్రియ ఆధారంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తాయి.
ఇదో కొత్త ప్రయోగం..
డిగ్రీలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న పరీక్ష విధానం నేటి అవస రాలకు సరిపోవట్లేదు. డిగ్రీ పూర్తి చేసే విద్యార్థిలో సామాజిక నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సమస్యలను అధిగమించే శక్తిని గుర్తించాల్సి ఉంది. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు ఉపాధి కల్పించేలా ఉండాలనే ప్రభుత్వ సరికొత్త ప్రయోగానికి అనుగుణంగానే అధ్యయనం మొదలు పెడుతున్నాం.
– చంద్రశేఖర్ శ్రీపాద, ఐఎస్‌బీ ప్రొఫెసర్–మానవ వనరులు
నాణ్యత పెరుగుతుంది..
ఇంతకాలం విద్యార్థి జ్ఞాపకశక్తినే మన పరీక్షల విధా నం శోధి స్తోంది. నైపుణ్యం, ఇతర లక్షణాలు వెలికి తీసే పరీక్ష విధానం ఉండాలి. ఇలా పరీక్షించినప్పుడు విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు సాధ్యమవుతాయి. దీంతో ఉన్నత విద్యలో నాణ్యత పెరుగుతుంది.
– ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment