సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అందులోనూ సైన్స్ కోర్సులపట్ల యువతులు మక్కువ చూపుతున్నారు. 2022–23 విద్యా ఏడాదికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే అబ్బాయిలతో పోల్చినప్పుడు అమ్మాయిల సంఖ్య 8,710 ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2022–23లో 4.60 లక్షల సీట్లు ఉండగా అందులో ‘దోస్త్’ ద్వారా 2,10,970 సీట్లు భర్తీ అయ్యాయి. భర్తీ అయిన సీట్లలో 1,01,130 మంది (47.94%) అబ్బాయిలు వివిధ కోర్సుల్లో చేరితే 1,09,840 మంది (52.06%) అమ్మాయిలు పలు డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాలు పొందారు. ఈ వివరాలను ఉన్నత విద్యామండలి సోమవారం వెల్లడించింది.
ఉపాధి వైపు అబ్బాయిలు.. :
కొన్నాళ్లుగా విద్యారంగంలో ట్రెండ్ పూర్తిగా మారిందని విద్యావేత్తలు చెబుతున్నారు. కరోనా తర్వాత బాలురు ఎక్కువగా డిగ్రీ తర్వాత ఉపాధి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇంజనీరింగ్‌లో 80 వేలకుపైగా సీట్లు భర్తీ అవగా అందులో 50%పైగా అబ్బాయిలే ఉంటున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ తక్షణ ఉపాధికి అవకాశం ఉన్న కోర్సులనే అబ్బాయిలు ఎంచుకుంటున్నారు. బీఏలో 18 వేల మంది అబ్బాయిలు చేరగా, బీకాంలో వారిసంఖ్య 48 వేలకుపైగా ఉంది. కరోనా తర్వాత కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడం, డిగ్రీ తర్వాత కుటుంబ బాధ్యతల్లో బాలుర పాత్ర పెరగడమే దీనికి కారణ మని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ అధ్యయనంలోనూ వెల్లడైంది.
సైన్స్ వైపు బాలికలు
‘దోస్త్’ ప్రవేశాల గణాంకాల ప్రకారం బాలికలు ఎక్కువగా సైన్స్ కోర్సులనే ఎంచుకున్నారు. బీకాంలో బాలురతో పోటీపడ్డారు. బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో బాలుర ప్రవేశాల సంఖ్య 10 వేలకుపైగా ఉంటే బాలికల ప్రవేశాలు 33 వేలకుపైగా ఉన్నాయి. బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో బాలురు 14 వేలకుపైగా ఉంటే బాలికలు 17 వేలకుపైగా ఉన్నా యి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలికల్లో 70% మంది ఉపాధి వైపు వెళ్తున్నా రని సర్వేలు పేర్కొంటున్నా యి. డిగ్రీలో చేరే బాలికలు మాత్రం ఉన్నతవిద్య వైపు వెళ్తున్నారు. ఉన్నత చదువుల వైపే బాలికలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని, ఇది మంచి పరిణామమేనని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
ఉన్నత విద్యపై అవగాహన పెరిగింది..
ప్రతి కుటుంబంలోనూ అమ్మాయిలను ఉన్నత విద్యవైపు నడిపించాలనే అవగాహన పెరగడం వల్లే డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. పాఠశాల, ఇంటర్ స్థాయి నుంచే బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు అందుబాటులో ఉండటం కూడా వారిని ఉన్నత విద్యవైపు మళ్లేలా చేస్తున్నాయి.
– ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి
Comments
Please login to add a commentAdd a comment