degree cources
-
డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతున్నాయి. అందులోనూ సైన్స్ కోర్సులపట్ల యువతులు మక్కువ చూపుతున్నారు. 2022–23 విద్యా ఏడాదికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే అబ్బాయిలతో పోల్చినప్పుడు అమ్మాయిల సంఖ్య 8,710 ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2022–23లో 4.60 లక్షల సీట్లు ఉండగా అందులో ‘దోస్త్’ ద్వారా 2,10,970 సీట్లు భర్తీ అయ్యాయి. భర్తీ అయిన సీట్లలో 1,01,130 మంది (47.94%) అబ్బాయిలు వివిధ కోర్సుల్లో చేరితే 1,09,840 మంది (52.06%) అమ్మాయిలు పలు డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాలు పొందారు. ఈ వివరాలను ఉన్నత విద్యామండలి సోమవారం వెల్లడించింది. ఉపాధి వైపు అబ్బాయిలు.. : కొన్నాళ్లుగా విద్యారంగంలో ట్రెండ్ పూర్తిగా మారిందని విద్యావేత్తలు చెబుతున్నారు. కరోనా తర్వాత బాలురు ఎక్కువగా డిగ్రీ తర్వాత ఉపాధి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇంజనీరింగ్‌లో 80 వేలకుపైగా సీట్లు భర్తీ అవగా అందులో 50%పైగా అబ్బాయిలే ఉంటున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ తక్షణ ఉపాధికి అవకాశం ఉన్న కోర్సులనే అబ్బాయిలు ఎంచుకుంటున్నారు. బీఏలో 18 వేల మంది అబ్బాయిలు చేరగా, బీకాంలో వారిసంఖ్య 48 వేలకుపైగా ఉంది. కరోనా తర్వాత కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడం, డిగ్రీ తర్వాత కుటుంబ బాధ్యతల్లో బాలుర పాత్ర పెరగడమే దీనికి కారణ మని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ అధ్యయనంలోనూ వెల్లడైంది. సైన్స్ వైపు బాలికలు ‘దోస్త్’ ప్రవేశాల గణాంకాల ప్రకారం బాలికలు ఎక్కువగా సైన్స్ కోర్సులనే ఎంచుకున్నారు. బీకాంలో బాలురతో పోటీపడ్డారు. బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో బాలుర ప్రవేశాల సంఖ్య 10 వేలకుపైగా ఉంటే బాలికల ప్రవేశాలు 33 వేలకుపైగా ఉన్నాయి. బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో బాలురు 14 వేలకుపైగా ఉంటే బాలికలు 17 వేలకుపైగా ఉన్నా యి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలికల్లో 70% మంది ఉపాధి వైపు వెళ్తున్నా రని సర్వేలు పేర్కొంటున్నా యి. డిగ్రీలో చేరే బాలికలు మాత్రం ఉన్నతవిద్య వైపు వెళ్తున్నారు. ఉన్నత చదువుల వైపే బాలికలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని, ఇది మంచి పరిణామమేనని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యపై అవగాహన పెరిగింది.. ప్రతి కుటుంబంలోనూ అమ్మాయిలను ఉన్నత విద్యవైపు నడిపించాలనే అవగాహన పెరగడం వల్లే డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. పాఠశాల, ఇంటర్ స్థాయి నుంచే బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు అందుబాటులో ఉండటం కూడా వారిని ఉన్నత విద్యవైపు మళ్లేలా చేస్తున్నాయి. – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
డిగ్రీ ఆనర్స్‌లో ఆధునిక సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో పని దినాలు, బోధనా గంటలకు అనుగుణంగా నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తయ్యేలా పాఠ్య ప్రణాళిక(సిలబస్) ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా సిలబస్ అత్యాధునికంగా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. గతంలో ఉన్న పేపర్ల విధానానికి బదులు కోర్సుల పేరిట చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌లో(సీబీసీఎస్) సెమిస్టర్ల కింద సిలబస్ ఉండనుంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏడాది పాటు అప్రెంటీస్ శిక్షణతో కూడిన నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సిలబస్ సంస్కరణల కమిటీ, సబ్జెక్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మార్గదర్శకాల మేరకు ఈ కమిటీలు సిలబస్‌పై కసరత్తు చేశాయి. బోధనా గంటలకు అనుగుణంగా కంటెంట్ - బోధనా గంటల పరిమాణానికి అనుగుణంగా సిలబస్ కంటెంట్ ఉండనుంది. - మొదటి సెమిస్టర్ నుంచి ఐదో సెమిస్టర్ వరకు విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలను అలవర్చేందుకు ఉద్దేశించిన అంశాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. - తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ తదితర సబ్జెక్టులు ప్రస్తుతం మూడు సెమిస్టర్ల వరకే ఉండగా, వీటిని నాలుగో సెమిస్టర్ వరకు పొడిగిస్తారు. - ఫౌండేషన్ కోర్సుగా కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్‌ను మొదటి సెమిస్టర్‌లోనే ప్రవేశపెట్టనున్నారు. - పాత సిలబస్‌లోని కాలం చెల్లిన అంశాలను తొలగిస్తారు. ఇటీవలి పరిణామాలకు అనుగుణంగా కొత్త అంశాలను చేరుస్తున్నారు. - అనవసర అంశాలను కత్తిరిస్తారు. - సగటు కాలేజీలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్స్ సిలబస్‌ను నిర్ణయిస్తున్నారు. - కొత్త కోర్సులతో పాటు ప్రస్తుతమున్న ఫౌండేషన్ కోర్సుల సంఖ్య పెంచుతారు. - పాఠ్య ప్రణాళికలో జ్ఞానం, మేథో, ఆచరణాత్మక నైపుణ్యాలుండేలా చర్యలు చేపట్టనున్నారు. - ప్రతి కోర్సులో చాప్టర్ వారీగా సిలబస్ ప్రారంభానికి ముందు విద్యార్థుల్లో ఆశించిన లక్ష్యాలను పొందుపరుస్తారు. -
ద్రవిడ వర్సిటీలో డిగ్రీ కోర్సులు: వీసీ
గుడుపల్లె (చిత్తూరు): ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2015-16 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ద్రవిడ వర్సిటీ ఇన్చార్జి వీసీ విజయప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ద్రవిడ వర్సిటీలోని వీసీ చాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయన్నారు. బీఏ, బీఎస్సీ, బీబీఎం కోర్సులు ఏర్పాటు చేశామన్నారు.