సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో పని దినాలు, బోధనా గంటలకు అనుగుణంగా నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తయ్యేలా పాఠ్య ప్రణాళిక(సిలబస్) ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా సిలబస్ అత్యాధునికంగా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. గతంలో ఉన్న పేపర్ల విధానానికి బదులు కోర్సుల పేరిట చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌లో(సీబీసీఎస్) సెమిస్టర్ల కింద సిలబస్ ఉండనుంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏడాది పాటు అప్రెంటీస్ శిక్షణతో కూడిన నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సిలబస్ సంస్కరణల కమిటీ, సబ్జెక్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మార్గదర్శకాల మేరకు ఈ కమిటీలు సిలబస్‌పై కసరత్తు చేశాయి.
బోధనా గంటలకు అనుగుణంగా కంటెంట్
- బోధనా గంటల పరిమాణానికి అనుగుణంగా సిలబస్ కంటెంట్ ఉండనుంది.
- మొదటి సెమిస్టర్ నుంచి ఐదో సెమిస్టర్ వరకు విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలను అలవర్చేందుకు ఉద్దేశించిన అంశాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు
తీసుకుంటారు.
- తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ తదితర సబ్జెక్టులు ప్రస్తుతం మూడు సెమిస్టర్ల వరకే ఉండగా, వీటిని నాలుగో సెమిస్టర్ వరకు పొడిగిస్తారు.
- ఫౌండేషన్ కోర్సుగా కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్‌ను మొదటి సెమిస్టర్‌లోనే ప్రవేశపెట్టనున్నారు.
- పాత సిలబస్‌లోని కాలం చెల్లిన అంశాలను తొలగిస్తారు. ఇటీవలి పరిణామాలకు అనుగుణంగా కొత్త అంశాలను చేరుస్తున్నారు.
- అనవసర అంశాలను కత్తిరిస్తారు.
- సగటు కాలేజీలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్స్ సిలబస్‌ను నిర్ణయిస్తున్నారు.
- కొత్త కోర్సులతో పాటు ప్రస్తుతమున్న ఫౌండేషన్ కోర్సుల సంఖ్య పెంచుతారు.
- పాఠ్య ప్రణాళికలో జ్ఞానం, మేథో, ఆచరణాత్మక నైపుణ్యాలుండేలా చర్యలు చేపట్టనున్నారు.
- ప్రతి కోర్సులో చాప్టర్ వారీగా సిలబస్ ప్రారంభానికి ముందు విద్యార్థుల్లో ఆశించిన లక్ష్యాలను పొందుపరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment