- కేయూ పరిధిలో ముగిసిన మూడో దశ దరఖాస్తు గడువు
- రెండు దశల్లో కలిపి 43,578 మందికి ప్రవేశాలు
- రేపు సీట్ల కేటాయింపు
- ఇప్పటివరకు 26 కళాశాలల్లో ప్రవేశాలే లేవు..
డిగ్రీ కళాశాలల్లో సగం సీట్లు ఖాళీ!
Published Mon, Aug 1 2016 1:30 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు దశల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మొదటి దశలో 41,909, రెండో దశలో 17,563 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పలువురు వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. రెండు దశల్లో కలిపి మొత్తంగా 43,578 మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. కాగా, యూనివర్సటీ పరిధిలోని 26 డిగ్రీ కళాశాలల్లో అసలు ఒక్కరు కూడా చేరకపోవడం గమనార్హం. మరో ఎనిమిది కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే చేరారు. దీంతో ఆయా కళాశాలలను మూసివేయక తప్పదనే భావన నెలకొంది.
మూడో దశలో 4,943 దరఖాస్తులు
యూనివర్సిటీ పరిధిలోని పెద్దసంఖ్యలో కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండడంతో మళ్లీ మూడో దశలో దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు, మొదటి దశలో సీట్లు రాని వారు, కొందరు కళాశాలల్లో చేరినా మార్పు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఈ దశలో అవకాశం కల్పించారు. అయితే, మూడో దశలో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు శనివారం ముగియగా మొత్తం 4,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 492మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఈ దశలో దరఖాస్తు చేసుకున్న వారికి, గతంలో దరఖాస్తులు చేసి ఇప్పుడు వెబ్‌ఆఫ్షన్లు ఇచ్చుకున్న వారికి, కళాశాలల మార్పునకు ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మంగళవారం సీట్ల కేటాయింపు జరగనుంది. ఆయా విద్యార్థులు 4వ తేదీన కళాశాలల్లో చేరా>ల్సి ఉంటుంది. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మొత్తంగా యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లలో 50శాతం సీట్లు కూడా భర్తీ అవుతాయా అనేది అనుమానంగా ఉంది. 50శాతంలోపే సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్లలో యూనివర్సిటీ పరిధిలో కొన్ని కళాశాలల్లో సీట్లు ఎక్కువ శాతం మేర భర్తీ కాగా మరికొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే సీట్లు నిండాయి. ఇక కొన్ని రకాల కాంబినేషన్ కోర్సులకైతే అసలే ఆదరణ లేనట్లు సమాచారం. అలాగే, పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. మూడో దశ సీట్ల కేటాయింపు, విద్యార్థుల చేరిక ప్రక్రియ పూర్తయితే తప్ప ఎన్ని సీట్లు మిగిలిపోతాయనే అంశం తేలనుంది. కాగా, 4వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.
Advertisement
Advertisement