
సాక్షి, హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సోమవారం తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) సీట్లను కేటాయించింది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ప్రవేశాల కోసం 1,37,874 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 1,29,790 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాగా వారిలో మొదటి దశలో 1,21,307 మంది సీట్లు లభించినట్లు వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన వారిలో 8,483 మందికి మొదటి దశలో సీట్లు లభించలేదు. ఇక విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం వారు ఇచ్చుకున్న మొదటి ప్రాధాన్యం (ఆప్షన్) ప్రకారమే 84,870 మందికి సీట్లు లభించాయి. మొదటి ఆప్షన్ ప్రకారమే వారికి సీట్లు వచ్చాయి కనుక వారు రెండో దశ కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకా«శం ఉండదని, వారంతా నేరుగా వెంటనే కాలేజీల్లో చేరాలని కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇక ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 8న ఉన్నందున ఇంజనీరింగ్‌లో సీట్లు వచ్చిన వారికి డిగ్రీలో సీటు వచ్చి ఉంటే వారి అభిప్రాయాన్ని తెలుసుకొని డిగ్రీ సీటు వద్దని అనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని, దాంతో వారి డిగ్రీ సీటు ఆటోమెటిక్‌గా రద్దు అవుతుందని వివరించారు. ఇక డిగ్రీలో చేరేందుకు బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. సీట్లు పొందిన 1,21,307 మందిలో బాలికలు 72,859 మంది ఉంటే బాలురు 48,448 మంది ఉన్నారు.
నేటి నుంచి రెండో దశ కోసం రిజిస్ట్రేషన్లు..
రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ నెల 5 నుంచే చర్యలు చేపడుతున్నట్లు కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొదటి దశలో సీట్లు రాని వారితోపాటు త్వరలోనే విడుదల కానున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యే వారికి రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాస్ అయ్యేవారు, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా ఇపుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. వారు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలన్నారు. మొదటి ఆప్షన్ల ప్రకారం సీట్లు పొందిన వారు మినహా మిగతా వారు ఇంప్రూవ్‌మెంట్ రౌండ్ కింద ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా, 14 వరకు ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వారికి 19న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు జనరల్ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్సీ, బీసీలు రూ.500 చెల్లించాలని, ఆ మొత్తం తరువాత ఫీజులో సర్దుబాటు చేస్తామని, కాలేజీల్లో చేరని వారికి వెనక్కి తిరిగి ఇచ్చేస్తామన్నారు. మరోవైపు మూడో దశ కౌన్సెలింగ్‌ను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, జూలై 2 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. జూలై 5 నుంచి 7 వరకు కాలేజీ పరి«ధిలోనే ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తామని వాటి కేటాయింపును జూలై 10న ప్రకటిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment