తప్పులతడక.. | Mistakes in employment registration card | Sakshi
Sakshi News home page

తప్పులతడక..

Published Mon, Feb 26 2018 8:12 AM | Last Updated on Mon, Feb 26 2018 8:12 AM

Mistakes in employment registration card - Sakshi

వివరాలు తప్పుగా ప్రచురితమైన ఎప్లాయిమెంట్‌ కార్డు

ఎవరైనా సున్నా శాతం మార్కులతో డిగ్రీ పాస్‌ అవుతారా..? అంటే కాదని ఎవరైనా సమాధానం చెబుతారు. అయితే, రాష్ట్ర ఉపాధి, శిక్షణశాఖ అధికారుల పనితీరు మాత్రం అవుననే సమాధానం చెబుతోంది. ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఆ శాఖ జారీ చేస్తున్న ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్డులో ఈ తరహా ఘోర తప్పిదాలు దొర్లుతున్నాయి. ఇదొక్కటే కాదు.. జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ కార్యాలయాలు సైతం మారిపోతున్నాయి. ఒక జిల్లా నుంచి ఎంప్లాయిమెంట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. మరొక జిల్లా కార్యాలయం పేరుతో కార్డులు జారీ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తప్పిదాలు నిరుద్యోగులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేస్తున్న ఎంప్లాయిమెంట్‌ కార్డులో ఇబ్బడిముబ్బడిగా దొర్లుతున్న తప్పులు.. రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖను అభాసుపాలు చేస్తున్నాయి. కార్డులో తప్పుడు సమాచారం ముద్రితం కావడంతో నిరుద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంప్లాయిమెంట్‌ కార్డు పొందాలంటే ఎన్నో వ్యయప్రయాసాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉపాధి కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలంటే సమయం వృథా అయ్యేది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉపాధి, శిక్షణ శాఖలో సంస్కరణలు చేపట్టింది. కూర్చున్న చోటు నుంచే ఎంప్లాయిమెంట్‌ కార్డు పొందేలా ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కొత్తగా ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్, రెన్యూవల్, అదనపు విద్యార్హతల నమోదు తదితర సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే అందించేలా చర్యలు తీసుకుంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ సేవలు ‘తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్‌ సర్వీస్‌ పోర్టల్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎంప్లాయిమెంట్‌ కార్డు పొందడం సులభతరం కావడంతో నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేమి, సాంకేతిక సమస్యల కారణంగా తప్పుల తడక వివరాలతో కార్డులు జారీ అవుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన తప్పిదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. 

ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చాక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఈనెల 20న తన ఎంప్లాయిమెంట్‌ కార్డుని వెబ్‌పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఇతను.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలో పొందిన ఉత్తీర్ణత శాతం, ఏ సంవత్సరంలో పాసయ్యాడో స్పష్టంగా పేర్కొన్నాడు. పైగా వాటిని ధ్రువీకరించే విద్యార్హత పత్రాలను సైతం అప్‌లోడ్‌ చేశాడు. అయితే, డిగ్రీ ఉత్తీర్ణత శాతం తప్పుగా నమోదైంది. సున్నా శాతంతో ఉత్తీర్ణుడైనట్లు అధికారులు కార్డులో పేర్కొన్నారు. అంతేగాక, అతడు 2007లోనే డిగ్రీ పాస్‌ అవగా.. 2010లో ఉత్తీర్ణుడైనట్లు కార్డులో నమోదు చేశారు. అదేవిధంగా, చేవెళ్ల మండలం రంగారెడ్డి జిల్లాను వికారాబాద్‌ జిల్లాగా పేర్కొన్నారు.  నిరుద్యోగులు అందజేసిన అన్ని రకాల ధ్రువపత్రాలను నిశితంగా పరిశీలించాకే జిల్లా ఉపాధి అధికారి సంతకంతో కూడిన కార్డు జారీ చేస్తారు. కానీ ఇబ్బడిముబ్బడిగా తప్పులు దొర్లుతున్న తీరును చూస్తే ఎటువంటి పరిశీలన లేకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి తనకు ఎదురైన అనుభవాన్ని జిల్లా ఉపాధి అధికారిణి నంద పద్మ దృష్టికి తీసుకెళ్లగా.. హెల్ప్‌లైనుకు కాల్‌ చేయండి లేదా మీ–సేవ కేంద్రానికి వెళ్లి సరిచేసుకోండని ఉచిత సలహా ఇచ్చినట్లు సదరు నిరుద్యోగి ‘సాక్షి’కి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement