సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్నాళ్లు అధికారిక గుర్తింపు లేకుండా కొనసాగిన గేమింగ్, యానిమేషన్ వంటి కోర్సులు ఇకపై మూడేళ్ల డిగ్రీ కోర్సులుగా కొనసాగించేందుకు యాజమాన్యాలు ముందుకొచ్చాయి. దీంతో వాటికి ప్రభు త్వం నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జవహర్‌లాల్‌నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఒప్పం దం చేసుకొని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే 17 విద్యా సంస్థలు వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి.
అయితే వాటిపై అనేక ఫిర్యాదులు రావడం, విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించని కోర్సులను డిగ్రీలుగా ఎలా కొనసాగిస్తున్నారని, వాటి నిర్వహణకు జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఎలా ఒప్పందం చేసుకుంటోందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజీసీ గుర్తించిన కోర్సులను వాటిల్లో నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కోర్సులు నిర్వహించడానికి వీల్లేదని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
అయితే సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో వాటి గుర్తింపునకు ఉత్తర్వులు జారీ చేసేలా పావులు కదిపారు. ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే సెలవుపై వెళ్లిన సదరు అధికారి తిరిగొచ్చాక విషయం తెలుసుకొని ఆ ఉత్తర్వులను అమలు చేయొద్దని లేఖ రాశారు. దీంతో యాజమాన్యాలు దిగివచ్చాయి. నాలు గేళ్లు కాకుండా మూడేళ్ల కోర్సులుగానే నిర్వహిస్తామని, వాటికి గుర్తింపు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment