సమావేశంలో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్ యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్, ఐఏసీసీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు
ఇప్పటివరకు 3 వేలకుపైగా హాలీవుడ్ చిత్రాలకు రాష్ట్రం నుంచి ఔట్‌సోర్సింగ్ ద్వారా పనులు
టీ–హబ్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 3 వేలకుపైగా హాలివుడ్ సినిమాలకు యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌లకు సబంధించిన అవుట్ సోర్సింగ్ పనులు చేశారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ–హబ్ ప్రాంగణంలో శనివారం వరల్డ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, యానిమేషన్, ఫిల్మ్, గేమింగ్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అలాగే తెలంగాణ వీఎఫ్‌ఎక్స్ యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్, ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలపైనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ నుంచి యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, సినిమాల ప్రచారంతోపాటు ప్రపంచ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, సినిమాలలో భారతదేశంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఆయన వివరించారు. సోనీ, కామ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి పెద్ద కంపెనీలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాయని చెప్పారు.
ఈ రంగాన్ని ప్రోత్సహించడంలో ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడు పంకజ్ బొహ్ర మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్, నిరంతర ఆవిష్కరణలు భారత్‌లో ఈ రంగాన్ని తాము ప్రోత్సహించడానికి ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అమెరికన్ కాన్సులేట్ వాణిజ్య వ్యవహరాల సలహాదారు రాఘవన్ శ్రీనివాసన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రాజెక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. మధుసూదన్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment