అధికారుల అడ్డగోలు ‘గేమింగ్’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న యానిమేషన్, గేమింగ్ వంటి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల గుర్తింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏళ్ల తరబడి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోర్సుల విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలతో అధికారులు కుమ్మక్కైన్నట్లు తెలిసింది. 2018–19లో గుర్తింపు విషయంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెలవులో ఉన్న సమయలలో నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచే ఉత్తర్వులు వచ్చేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటికి అనుమతులు ఇవ్వబోమని ముందుగానే స్పష్టం చేసినా, సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో సాంకేతిక విద్యా శాఖ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించడం, ఆయన్ని తప్పుదోవ పట్టించి ఉత్తర్వులు జారీ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి తిరిగి విధుల్లో చేరాక, విషయం తెలుసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తారంటూ సాంకేతిక విద్యా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులను అమలు చేయవద్దని ఇటీవల లేఖ రాయడంతో గందరగోళం నెలకొంది.
ఎలాంటి గుర్తింపు లేకుండానే..
హైదరాబాద్‌లో వివిధ రంగాలతోపాటు, సినీ ఇండస్ట్రీకి ఉపయోగపడే పలు స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చే 17 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్లు ఉన్నాయి. అవి కాలేజీలు కాదు. వాటికి యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు కూడా లేదు. అవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్ అండ్ గేమింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, ఈవెంట్ ప్లానింగ్, కాస్మెటాలజీ వంటి కోర్సుల్లో 6 నెలల డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. అవే కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)తో అవి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందం ద్వారా కోర్సుల నిర్వహణకు అనుమతిచ్చే అధికారం ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి లేదు. పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉండాలి. సాంకేతిక విద్యా కోర్సులు ఉన్నందున ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవీ లేకుండానే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి.
వర్సిటీ పాత్రపై అనుమానాలు!
యూజీసీ నుంచి, ఏఐసీటీఈ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, కాలేజీలుగా గుర్తింపు లేకున్నా యూజీ, పీజీ కోర్సులను హైదరాబాద్‌లోని 17 సంస్థలు నిర్వహిస్తుండటం, వాటితో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఒప్పందం చేసుకోవడంపై అనేక ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2016లోనే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహించవద్దని చెప్పినా జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఒప్పందాన్ని కొనసాగించడంలో మతలబు ఏంటన్నది అధికారులే చెప్పాల్సి ఉంది. తప్పు జరుగుతోందని తెలిసినా, విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా.. 2017–18లో కోర్సులను కొనసాగించేందుకు యూనివర్సిటీ అధికారులు భారీ మొత్తంలో దండుకొని అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్పెషల్ సీఎస్ లేని సమయం చూసి..
2018–19లో ఆ కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ససేమిరా అన్నారు. దీంతో సదరు అధికారి అనారోగ్యం కారణంగా గత నెలలో సెలవుపై వెళ్లారు. అదే అదనుగా భావించిన సంస్థలు తమ కోర్సుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సాంకేతిక విద్యా శాఖను ఆశ్రయించాయి. వాస్తవానికి వాటికి ప్రతిపాదనలు పంపాల్సింది ఉన్నత విద్యా శాఖ అయినా సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి ఫైలు పంపించింది. ఈ వ్యవహారం తెలియని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత నెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుపై వెళ్లిన అధికారి తిరిగి వచ్చే సరికి జీవో వెలువడటంతో విస్మయానికి గురయ్యారు. వెంటనే ఆ జీవోను అమలు చేయవద్దని లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment