collage
-
తెలంగాణ: సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. -
ఐదేళ్లలో 235 కాలేజీలమూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 235 కాలేజీలు (అన్ని రకాలు) మూతబడ్డాయి. అందులో గత రెండేళ్లలోనే భారీగా కాలేజీలు మూతబడ్డాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయడం, మెరుగైన విద్య అందించేలా అనేక సంస్కరణలు తీసుకు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అందులోనూ చాలా వరకు కాలేజీలను యాజమా న్యాలు స్వచ్ఛందంగానే రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, కర్ణాటకలోనే అత్యధిక కాలేజీలు ఉన్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందికి 28 కాలేజీలు మాత్రమే ఉంటే.. తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రం ప్రతి లక్ష మందికి 51 కాలేజీలు ఉన్నట్లు వెల్లడించింది. అందులో 82 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలోనే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యలో మాత్రం ఐదేళ్లలో పెద్దగా పెరుగుదల నమోదు కాలేదు. ఐదేళ్లలో కేవలం 50 వేల మంది విద్యార్థులే పెరిగారు. 2013–14లో రాష్ట్రంలోని కాలేజీల్లో 14,19,307 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 14,69,484కు పెరిగింది. పెరిగినా.. భారీగానే మూత రాష్ట్రంలో 2013–14లో 2,280 ఉన్నత విద్య కాలేజీలు ఉంటే 2016 నాటికి వాటి సంఖ్య 2,454కు పెరిగింది. ఆ మేరకు 174 కాలేజీలు పెరిగాయి. దాని ప్రకారం 2016లో ప్రతి లక్ష మందికి 60 కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయింది. దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నాయి. సంఖ్యాపరంగా తగ్గినా ఈ రెండు రాష్ట్రాల్లోనే కాలేజీలు అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణ, కర్ణాటకలో ప్రతి లక్ష మందికి 51 కాలేజీలు ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అంత ఎక్కువ కాలేజీలు లేవు. పైగా 2013–14లో ప్రతి లక్ష మందికి 55 కాలేజీలు ఉంటే.. ఇపుడు 51కి తగ్గాయి. అంటే ప్రతి లక్ష మందికి 4 చొప్పున కాలేజీలు తగ్గిపోయాయి. బిహార్లో తక్కువ కాలేజీలు దేశంలో 18 నుంచి 23 ఏళ్ల వయసున్న ప్రతి లక్ష మందికి (డిగ్రీ, ఆపై చదువులను అందించే) కాలేజీలు సగటున 28 ఉన్నాయి. అయితే బిహార్లో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అక్కడ ప్రతి లక్ష మందికి కేవలం ఏడు కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత తక్కువ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, జార్ఖండ్ ఉన్నాయి. అక్కడ ప్రతి లక్ష మందికి 8 కాలేజీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ప్రతి లక్ష మందికి 12 కాలేజీలే ఉన్నాయి. దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న మొదటి 10 జిల్లాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో 472 కాలేజీలు ఉన్నాయి. 343 కాలేజీలతో రంగారెడ్డి 5వ స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో 2016–17లో 438 కాలేజీలు ఉంటే 2017–18 నాటికి వాటి సంఖ్య 343కు పడిపోయింది. -
అధికారుల అడ్డగోలు ‘గేమింగ్’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న యానిమేషన్, గేమింగ్ వంటి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల గుర్తింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏళ్ల తరబడి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోర్సుల విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలతో అధికారులు కుమ్మక్కైన్నట్లు తెలిసింది. 2018–19లో గుర్తింపు విషయంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెలవులో ఉన్న సమయలలో నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచే ఉత్తర్వులు వచ్చేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటికి అనుమతులు ఇవ్వబోమని ముందుగానే స్పష్టం చేసినా, సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో సాంకేతిక విద్యా శాఖ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించడం, ఆయన్ని తప్పుదోవ పట్టించి ఉత్తర్వులు జారీ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి తిరిగి విధుల్లో చేరాక, విషయం తెలుసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తారంటూ సాంకేతిక విద్యా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులను అమలు చేయవద్దని ఇటీవల లేఖ రాయడంతో గందరగోళం నెలకొంది. ఎలాంటి గుర్తింపు లేకుండానే.. హైదరాబాద్లో వివిధ రంగాలతోపాటు, సినీ ఇండస్ట్రీకి ఉపయోగపడే పలు స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చే 17 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అవి కాలేజీలు కాదు. వాటికి యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు కూడా లేదు. అవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్ అండ్ గేమింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, ఈవెంట్ ప్లానింగ్, కాస్మెటాలజీ వంటి కోర్సుల్లో 6 నెలల డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. అవే కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించేందుకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)తో అవి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందం ద్వారా కోర్సుల నిర్వహణకు అనుమతిచ్చే అధికారం ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి లేదు. పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉండాలి. సాంకేతిక విద్యా కోర్సులు ఉన్నందున ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవీ లేకుండానే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. వర్సిటీ పాత్రపై అనుమానాలు! యూజీసీ నుంచి, ఏఐసీటీఈ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, కాలేజీలుగా గుర్తింపు లేకున్నా యూజీ, పీజీ కోర్సులను హైదరాబాద్లోని 17 సంస్థలు నిర్వహిస్తుండటం, వాటితో జేఎన్ఏఎఫ్ఏయూ ఒప్పందం చేసుకోవడంపై అనేక ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2016లోనే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహించవద్దని చెప్పినా జేఎన్ఏఎఫ్ఏయూ ఒప్పందాన్ని కొనసాగించడంలో మతలబు ఏంటన్నది అధికారులే చెప్పాల్సి ఉంది. తప్పు జరుగుతోందని తెలిసినా, విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా.. 2017–18లో కోర్సులను కొనసాగించేందుకు యూనివర్సిటీ అధికారులు భారీ మొత్తంలో దండుకొని అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ సీఎస్ లేని సమయం చూసి.. 2018–19లో ఆ కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ససేమిరా అన్నారు. దీంతో సదరు అధికారి అనారోగ్యం కారణంగా గత నెలలో సెలవుపై వెళ్లారు. అదే అదనుగా భావించిన సంస్థలు తమ కోర్సుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సాంకేతిక విద్యా శాఖను ఆశ్రయించాయి. వాస్తవానికి వాటికి ప్రతిపాదనలు పంపాల్సింది ఉన్నత విద్యా శాఖ అయినా సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి ఫైలు పంపించింది. ఈ వ్యవహారం తెలియని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత నెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుపై వెళ్లిన అధికారి తిరిగి వచ్చే సరికి జీవో వెలువడటంతో విస్మయానికి గురయ్యారు. వెంటనే ఆ జీవోను అమలు చేయవద్దని లేఖ రాశారు. -
‘డీఎన్నార్’ డిగ్రీ ఫలితాలు విడుదల
భీమవరం : భీమవరం డీఎన్నార్ డిగ్రీ కళాశాలలో పరీక్షా ఫలితాలను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గాదిరాజు సత్యనారాయణరాజు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి, నేటి టెక్నాలజీకి అనుగుణంగా తమ కళాశాలలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ డిగ్రీ పరీక్షా ఫలితాల్లో బీఏ గ్రూపులో 83 శాతం, బీఎస్సీలో 64 శాతం, బీకాం (జనరల్) 94 శాతం, బీకాం (ఒకేషనల్) 90 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. బీఎస్సీలో Ðð జయశ్రీ 91.96 శాతం మార్కులతో ప్రథమస్థానంలో నిలవగా పి.సత్యనాగ శ్రావణి 91.88 శాతంతో ద్వితీయ, వి.నాగప్రసన్న 90.48 శాతం మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించారు. విద్యార్థులకు పరీక్షా పత్రాల రీవాల్యేషన్, ప్రత్యక్ష పరిశీలనకు మే 5వ తేదీ వరకూ అవకాశం ఉందన్నారు. అలాగే మే 8 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు రామకృష్ణంరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎంవీ రఘుపతిరాజు, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అల్లూరి సురేంద్ర, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పీవీ రామరాజు పాల్గొన్నారు. -
నెల్లూరులో మెడికో ఆత్మహత్య
నెల్లూరు: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థిని నాగ శ్రావణి ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో విద్యార్థిని మృతిపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగ శ్రావణి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుందని పోలీసులు తెలిపారు. యాజమాన్యం ఒత్తిడి కారణంగానే నాగ శ్రావణి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కాలేజి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.