న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద రంగం నెమ్మదిగా కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకుంది. 10–12% వార్షిక వృద్ధితో 2030 నాటికి 55–70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ మొదలై నవి గణనీయంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు ఊతంగా నిలవనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటల్ వీడియోల వినియోగం మిగతా విభాగాలన్నింటినీ మించి భారీ స్థాయిలో పెరుగుతోందని నివేదిక పేర్కొంది. చైనాతో పాటు అంతర్జాతీయంగా అత్యధికంగా వృద్ధి నమోదు చేస్తున్న మార్కెట్లలో ఒకటిగా దేశీ మీడియా, వినోద రంగం కూడా ఒకటని తెలిపింది. ‘టీవీల్లో ప్రకటనల పరిమాణాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. భవిష్యత్ లో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతీయ చానళ్లలో అడ్వర్టైజింగ్ పెరగడం, కొత్తగా వచ్చే ప్రకటనకర్తల సంఖ్య వృద్ధి చెందనుండటం ఇందుకు దోహదపడగలవు‘ అని నివేదిక వివరించింది.
చౌక డేటాతో అందుబాటులోకి ఓటీటీలు..
డేటా ధరలు మరింతగా తగ్గిపోవడంతో ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ చెల్లింపుల విధానాలు గణీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ వీడియోలు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. వివిధ రకాల కంటెంట్ అందిస్తున్న 40 పైచిలుకు సంస్థలతో తీవ్రమైన పోటీ నెలకొన్న వర్ధమాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందని వివరించింది. గత కొన్నేళ్లుగా ఎస్‌వీవోడీ (సబ్‌స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)లకు డిమాండ్ బాగా పెరిగిందని.. రాబోయే రోజుల్లో ఇది ఏవీవోడీ (అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)ని మించిపోగలదని పేర్కొంది. యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థలు .. ధరల విషయంలో వినూత్న విధానాలు పాటించడం, కంటెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలైనవి ఇందుకు దోహదపడుతున్నాయని నివేదిక తెలిపింది.
గేమింగ్ వృద్ధికి మరింతగా అవకాశం..
గేమింగ్ విషయానికొస్తే.. అమెరికా, చైనాతో పోల్చినప్పుడు ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ మొబైల్ వినియోగం పెరిగే కొద్దీ ఇది పటిష్టంగా వృద్ధి కనపర్చవచ్చని వివరించింది. ‘భారత్ ప్రతిభావంతులకు హబ్‌గా మారుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో గేమింగ్ కంపెనీల సంఖ్య పది రెట్లు పెరిగింది. గత కొన్నాళ్లుగా ఈ రంగంలో వెంచర్ క్యాపిటల్ సంస్థల పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి‘ అని సీఐఐ, బీసీజీ నివేదిక తెలిపింది.
కోవిడ్ పూర్వ స్థాయికి మీడియా, వినోదం
Published Fri, Dec 31 2021 6:34 AM | Last Updated on Fri, Dec 31 2021 6:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment