కాలు కదిపితే కాసులు రాల్చే కెరీర్.. డ్యాన్సింగ్
నాట్యం, నృత్యం.. ప్రాచీన కళలు. ఆదిమ మానవుల కాలంలోనే ఇవి ప్రాణం పోసుకున్నాయి. మనిషి జ్ఞానవంతుడిగా మారాక మరింత అభివృద్ధి చెందాయి. కాలానుగుణంగా ఆధునిక హంగులద్దుకున్నాయి. ప్రపంచంలో అన్ని మానవ జాతుల్లో నృత్యం విడదీయలేని భాగం. మనసుకు ఆనందం, ఉత్తేజం కలిగించే శక్తి డ్యాన్స్‌కు ఉంది. అందుకే కళాతృష్ణ ఉన్న ప్రతిఒక్కరూ నృత్యంపై మక్కువ కనబరుస్తుంటారు. నేడు ఎన్నో రకాల వేడుకల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల కార్యక్రమాల్లోనూ వీటికి చోటు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నృత్యకారులకు అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు సినిమా, టీవీ రంగాలు ప్రతిభావంతులకు స్వాగతం పలుకుతున్నాయి. నృత్యంపై ఆసక్తి ఉన్నవారు దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే జీవనానికి ఢోకా ఉండదని కచ్చితంగా చెప్పొచ్చు.
మెండుగా అవకాశాలు, ఆదాయం
కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యరీతులతోపాటు సల్సా, జాజ్, వెస్ట్రన్ క్లాసికల్, హిప్హాప్ వంటి విదేశీ కళారూపాలపై యువత ఆసక్తి చూపుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు నగరాలు, పట్టణాల్లో డ్యాన్స్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. నాట్యం, నృత్యాన్ని పూర్తి స్థాయి ఉపాధి మార్గంగా మార్చుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. పెరుగుతున్న అవకాశాలే ఇందుకు నిదర్శనం. వివాహ వేడుకలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సమావేశాలు, సదస్సుల్లో అతిథులను అలరించేందుకు నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్యాన్సర్లకు ఆకర్షణీయమైన వేతనం ఆఫర్ చేస్తున్నారు. ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ.వేలల్లో సంపాదించుకునే వీలుంది. దీనికితోడు పేరు ప్రఖ్యాతలు, సన్మానాలు, పురస్కారాలు, బహుమానాలు ఉండనే ఉన్నాయి. కళాకారులను సత్కరించుకోవడం మన సంస్కృతిలో భాగం. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న నృత్యకారులు మన దేశంలో ఎందరో ఉన్నారు. డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంటే సమాజంలో సెలబ్రిటీ హోదాను అందుకోవచ్చు. వేదికలపై ప్రతిభ చూపి, సినీ రంగంలో కాలుమోపితే అవకాశాలకు, ఆదాయానికి కొదవే ఉండదు.
కావాల్సిన నైపుణ్యాలు: డ్యాన్సర్‌కు నృత్యంపై అభిరుచి ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిత్యం క్రమశిక్షణతో సాధన చేయగలగాలి. ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలపాటు ప్రాక్టీస్ చేయాలి. నూతన నృత్య రీతులను నేర్చుకుంటూ ప్రతిభను మెరుగుపర్చుకోవాలి. ఇందుకు అంకితభావం, కష్టపడేతత్వం తప్పనిసరిగా ఉండాలి.
అర్హతలు: ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా నృత్యం నేర్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. అయితే, డ్యాన్స్‌ను మనస్ఫూర్తిగా ప్రేమించి, ఆరాధించేవారే ఇందులోకి రావడం మంచిది. నృత్యకారులుగా రాణించాలంటే దీనిపై సహజమైన ఆసక్తి, ప్రతిభ ఉండాలి. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే నిరంతర సాధనే ఏకైక మార్గం. దీన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు.
వేతనాలు: డ్యాన్సర్లకు ప్రారంభంలో తక్కువ వేతనాలే ఉన్నా అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరుగుతుంది. ఒక్కో కార్యక్రమానికి రూ.3 వేల వరకు అందుకోవచ్చు. మంచి డ్యాన్సర్‌గా పేరుతెచ్చుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే సంపాదించుకోవచ్చు. సినిమా రంగంలో ఎక్కువ వేతనాలు ఉంటాయి. ప్రతిభతో కొరియోగ్రాఫర్ స్థాయికి చేరుకుంటే రూ.లక్షల్లో రెమ్యూనరేషన్ పొందొచ్చు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం-హైదరాబాద్
వెబ్సైట్: http://teluguuniversity.ac.in/
స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో-హైదరాబాద్
వెబ్సైట్: www.stepsdanz.com
షియామక్ దావర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
వెబ్సైట్: www.shiamak.com/dance-school-about.html
ద డ్యాన్స్ వర్క్స్. వెబ్సైట్ : www.thedanceworx.com
సల్సా ఇండియా. వెబ్సైట్: www.salsa-india.com
ఫిట్నెస్తోపాటు మంచి అవకాశాలు
‘‘ఆధునిక కాలంలో వివిధ నృత్యాలను నేర్చుకుంటే కెరీర్‌కు ఢోకా ఉండదు. సినీ రంగంలో, సంగీత పోటీలు, స్కూళ్లలో, ఇతర వేదికలపై ఫ్రీస్టైల్స్ నృత్య నిపుణులకు అవకాశా లుంటాయి. అలాగే హిప్హాప్, బాల్రూమ్, సల్సా తదితర స్టైల్స్‌లో నైపుణ్యం సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు కూడా తరచుగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఫిట్నెస్తోపాటు మంచి కెరీర్‌ను కూడా డ్యాన్స్ ద్వారా సొంతం చేసుకోవచ్చు’’
- పృథ్వీరాజ్ రామస్వామి, డెరైక్టర్, స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో