కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
Published Mon, Aug 15 2016 11:17 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు ఈనెల 17 నుంచి జరగాల్సిండగా కృష్ణా పుష్కరాల నేపథ్యంలో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం సోమవారం వెల్లడించారు. ఇదిలా ఉండగా పరీక్షలు వాయిదా వేయటంపై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే పరీక్షల కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసిన అధికారులు ఇటీవలే టైంటేబుల్ ప్రకటించారు.
తీరా పరీక్షల సమయం సమీపించాక పుష్కరాలపేరుతో వాయిదా వేయటం సరికాదని అంటున్నారు. కృష్ణా పుష్కరాల తేదీలను ప్రభుత్వం ముందే ప్రకటించినా పరీక్షల నిర్వాహకులు ఎగ్జామ్స్ టైంటేబుల్ ఎలా ప్రకటిస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాలను సాకుగా చూపిస్తున్నప్పటికీ అబ్జర్వర్లకు డ్యూటీల వేసే విషయంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అబ్జర్వర్ల డ్యూటీల కోసం పార్ట్‌టైం, కాంట్రాక్టు లెక్చరర్లు, పరిశోధకులు, పీడీఎఫ్ అభ్యర్థులు పోటీ æపడుతున్నారు. అంతర్గతంగా అనేకరకాలు ఉన్న ఒత్తిళ్ల కారణంగానే పరీక్షల నిర్వహణలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. పరీక్షలు సమీపించాక కూడా హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పెట్టకపోవటం సమస్యగానే మారినట్లు సమాచారం.
Advertisement